పటాన్చెరు, జనవరి 2: కేంద్ర ప్రభుత్వంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ)తో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ గురువారం న్యూఢిల్లీలోని సీబీసీ కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వంలోని మానవ వనరుల నిర్వహణను మెరుగుపర్చడం, దేశంలోని 2.5 కోట్ల పౌరసేవల సామర్థ్యం బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నాలెడ్జ్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ ఒప్పందంపై కేఎస్పీపీ తరఫున డీన్, పూర్వ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్, డాక్టర్ షరీక్ హసన్మన్జీర్, సీబీసీ ప్రతినిధి బృందంలో మానవ వనరుల విభాగం సభ్యుడు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శి ఎస్పీ రాయ్, అధికారులు రాహుల్ పోర్వాల్, నిఖితాసురానా పాల్గొన్నారు.
మానవ వనరుల అభ్యాసా లు, సామర్థ్యం పెంపొందించడంలో సీబీ సీ ముందంజలో ఉండి, వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలోని విభాగాలకోసం ప్రణాళికలను రూపొందించి, అమలు చేయడానికి కృషి చేస్తున్నది. ప్రముఖ సంస్థలతో వ్యూహాత్మక జ్ఞాన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంటున్నది. కేఎస్పీపీ, సీబీసీల మధ్య ఈ భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వపాలనలో విప్లవాత్మక మార్పులకు, పౌర సేవల సామర్థ్యాన్ని పెంపొందించి, ప్రభావవంతమైన ఫలితాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.