హైదరాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో వచ్చేనెల ఒకటి వరకు కార్తీకమాసోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఈవో చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో గర్భాలయ అభిషేక పూజలు, ఆర్జిత సేవలు రద్దుచేస్తున్నట్టు వెల్లడించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్యనదీహారతి, జ్వాలాతోరణం నిర్వహిస్తామని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): కార్తీక మాసం సందర్భంగా నేటి నుంచి డిసెంబర్ ఒకటి వరకు రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలు వేములవాడ, ధర్మపురి, కీసర, శ్రీశైలంకు స్పెషల్ బస్సులు నడుపనున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఆర్టీసీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. రిజర్వేషన్ కోసం tgsrtcbus.in వెబ్సైట్లో సంప్రదించాలని కోరారు. శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన నడిపే ఆర్టీసీ బస్సులకు బీవోసీ(బస్ ఆన్ కాంట్రాక్ట్) చార్జీలు తగ్గించామని తెలిపారు. పల్లె వెలుగుకు కిలోమీటర్‌కు రూ. 11, ఎక్స్‌ప్రెస్‌కు రూ. 7, డీలక్స్‌కు రూ.8, సూపర్లగ్జరీకి రూ.6, రాజధానికి రూ.7 చొప్పున తగ్గించామని పేర్కొన్నారు.