పెద్దవంగర, డిసెంబర్ 26 : తొమ్మిది నెలలుగా జీతాలు రాక అనారోగ్యం బారిన పడిన ఓ కారోబార్ మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఉప్పరగూడెంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పంచాయతీ కార్మికుడు బైన రవికుమార్(34) తొమ్మిది నెలలుగా జీతం రాక ఇబ్బంది పడుతున్నారు. ఇరవై రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రవికుమార్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు సైదులు, జీపీ కార్మిక సంఘం మండలాధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. కార్మికులకు జీతాలు అందించి ఉంటే.. రవికుమార్ చనిపోయే పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. కార్మికుడి మృతికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.