హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : కృష్ణా నదితోపాటు తుంగభద్ర, భీమా నదులపై కూడా ఎడాపెడా ప్రాజెక్టులు చేపట్టేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. బరాజ్‌లను ప్రతిపాదిస్తున్నది. ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులను విస్తరించేందుకు సైతం శరవేగంగా అడుగులు వేస్తున్నది. కర్ణాటక ప్రణాళికలు కార్యరూపం దాల్చితే శ్రీశైలం ప్రాజెక్టుకు, తద్వారా తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుంది. అంతటి ప్రమాదం పొంచి ఉన్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నోరుమెదపకపోవడం గమనార్హం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై ఇంజినీరింగ్ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతున్నది.
బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీల నీటిని వినియోగించుకొనే లక్ష్యంతో తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారు. తుంగభద్ర డ్యామ్ ద్వారా కర్ణాటకలో 9,30,626 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 6,25,097 ఎకరాలు, తెలంగాణలో 87 వేల ఎకరాలు ఆయకట్టు ఉన్నది. డ్యామ్‌లో పూడిక పెరుగడంతోపాటు వరద ప్రవాహాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఆవిరి నష్టాలతో కలుపుకొని 230 టీఎంసీలు ఉపయోగించుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం 174.72 టీఎంసీలను కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఉన్నదని, మొత్తంగా 55.28 టీఎంసీలను నష్టపోవాల్సి వస్తున్నదని కర్ణాటక చెప్తున్నది. దానినే సాకుగా చూపి ప్రస్తుతం ఉన్న తుంగభద్ర లోలెవల్ కెనాల్ (ఎల్ఎల్సీ)కి సమాంతరంగా మరో కాలువను తవ్వేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. కొప్పల్ జిల్లా గంగావతి తాలుకాలో ఇప్పటికే 31 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నావలి రిజర్వాయర్‌ను 52 టీఎంసీలకు విస్తరించి తుంగభద్ర డ్యామ్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించుకొనేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ చేపడుతామని కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలు అనేకమార్లు మీడియా ముఖంగా ప్రకటించారు. ఆ దిశగా ప్రస్తుతం వేగంగా అడుగులు వేస్తున్నది.
కర్ణాటక ప్రతిపాదనలు అమలైతే తెలంగాణ రాష్ర్టానికి తీరని నష్టం వాటిల్లుతుంది. కృష్ణా నదికి తుంగ, భద్ర ఉపనదులు. ఆ రెండింటి నుంచే ఏటా దాదాపు 500 టీఎంసీల జలాలు కృష్ణా నదిలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్రా నదిపై ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ప్రాజెక్టులను నిర్మించకుండా అనేక ఆంక్షలు విధించింది. షరతులు పెట్టింది. కానీ, కర్ణాటక సర్కార్ ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ నిర్మాణాలు చేపడుతున్నది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంటున్నది. ఏపీ సైతం వరదజలాల పేరిట ప్రాజెక్టులను చేపడుతామని చెప్తూ అనేక కుట్రలకు తెరలేపింది. ప్రస్తుతం ఆ రెండు రాష్ర్టాలు చేస్తున్న ప్రణాళికలు అమలైతే భవిష్యత్తులో తుంగభద్ర నుంచి కృష్ణాలోకి వచ్చే జలాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఫలితంగా కృష్ణా జలాలపైనే పూర్తిగా ఆధారపడిన తెలంగాణకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని తెలంగాణ ఇంజినీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎల్లకాలం ఎండుడేనని హెచ్చరిస్తున్నారు. వెరసి మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు కృష్ణా జలాలే దక్కకుండా పోయే ప్రమాదం ఉన్నది.
ఈ నేపథ్యంలోనే కర్ణాటక సర్కార్ ప్రతిపాదనలు తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టమని, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని ప్రకటిస్తూ నాటి బీఆర్ఎస్ సర్కార్ అనేకమార్లు తేల్చిచెప్పింది. ట్రిబ్యునల్-2 అవార్డు అమల్లోకి వచ్చేంత వరకూ ప్రాజెక్టుల విస్తరణ ప్రతిపాదనలపై ముందుకుపోవద్దని కరాఖండిగా స్పష్టంచేసింది. కానీ, ప్రస్తుత రేవంత్ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. కర్ణాటక ప్రణాళికలపై నోరు విప్పకపోవడం సంగతి అటుంచితే తాజాగా వాటిపై చర్చలకు తెలంగాణ మంత్రులే కర్ణాటక మంత్రిని ఆహ్వానించడం, కొన్ని ప్రతిపాదనలపై చర్చలకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేయడంపై అధికారులు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి బోసు రాజు కాంగ్రెస్ సీనియర్ లీడర్. రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లతో మంచి సంబంధాలున్నాయి. ఆయన మాటకు ఎదురేలేదనేదని ఆ వర్గాల్లో చర్చ. బోసు రావడం, వెనువెంటనే కమిటీ ఏర్పాటుకు కాంగ్రెస్ మొగ్గుచూపడం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఆగమేఘాల మీద రెండురోజుల పర్యటన ఏర్పాటుచేసుకుని, సర్వే చేపట్టడం ఆయనకు గల ప్రాధాన్యత తేటతెల్లమవుతున్నది. ఇప్పుడిదే విషయమై రాష్ట్ర ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఏమాత్రం సంప్రదించకుండా, అంతర్రాష్ట్ర వివాదాలు, తెలంగాణకు వాటిల్లే ముప్పుపై అవగాహన లేకుండా, కనీసం ఆరా తీయకుండానే కమిటీ ఏర్పాటుకు అంగీకరించడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇవికాకుండా కృష్ణా, తుంగభద్ర, భీమా నదులపై కర్ణాటక సర్కార్ ఇబ్బడిముబ్బడిగా బరాజ్‌లను సైతం నిర్మించేందుకు సిద్ధమవుతున్నది. కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రదేశానికి ఎగువన గుర్జాపూర్ వద్ద బరాజ్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది. కృష్ణా నదిపై కొల్పూర్ గ్రామం వద్ద తెలంగాణ సరిహద్దులో ఇరు రాష్ర్టాలకు ఉపయోగకరంగా బరాజ్‌ను నిర్మించవచ్చని ప్రతిపాదనలు సిద్ధంచేసింది. రాయచూరు జిల్లా మాన్వి తాలుకా చిక్కాలపర్వి గ్రామ సమీపంలో బ్రిడ్జి కమ్ బరాజ్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. అందుకు గత బడ్జెట్లో రూ.158 కోట్లు కేటాయించింది. భీమా నదిపై తంగడి గ్రామం వద్ద బరాజ్‌ను నూతనంగా సిద్ధంచేసింది. ఇప్పటికే అనేక బరాజ్‌లను నిర్మించిన కర్ణాటక తాజాగా మరికొన్నింటికి ప్రతిపాదనలు సిద్ధంచేయడం గమనార్హం. మరీ ముఖ్యంగా తుంగభద్రపై ఎక్కువగా దృష్టిపెట్టినట్టు ఆ రాష్ట్ర ప్రణాళికలను చూస్తే తెలిపోతున్నది.
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు కర్ణాటక సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తున్నది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటక ప్రతిపాదించిన యూకేపీ ఆల్మట్టి ఫేజ్-3 (అప్పర్ కృష్ణా ప్రాజెక్టు)కు 130 టీఎంసీలు కేటాయించింది. ఆ జలాల వినియోగానికి ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుకొనేందుకు అనుమతిచ్చింది. తద్వారా ఆల్మట్టి ప్రస్తుత నీటిమట్టం 123.08 టీఎంసీలకు అదనంగా మరో 100 టీఎంసీల స్టోరేజీ సామర్థ్యం పెరుగుతుంది. దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ సైతం అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు, ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాకపోవడంతో ఇప్పటివరకు అది పెండింగ్‌లోనే ఉన్నది.

కానీ, అవార్డు అమల్లోకి రాకముందే ఆల్మట్టి ఎత్తు పెంపును చేపట్టేందుకు కర్ణాటక సిద్ధమైంది. ఎత్తు పెంచి నీటినిల్వ సామర్థ్యం పెంపునకు దాదాపు 1.33 లక్షల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉన్నది. అందుకు రూ.70 వేల కోట్ల మేరకు అవసరమవుతాయని అంచనా వేయగా, ఆ ప్రతిపాదనలకు కర్ణాటక ప్రభుత్వం ఇటీవలనే ఆమోదం తెలిపింది. ఏటా భూసేకరణకు రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు వెచ్చించేందుకు నిర్ణయించింది. అవార్డును పాక్షికంగా అమలు చేసేలా చూడాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నది. అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు సంబంధించిన పనులను కూడా వేగంగా ముందుకు తీసుకుపోతున్నది. ప్రాజెక్టును కేంద్రమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా, అందుకు సంబంధించిన నిధులు కేటాయించాలని కేంద్రంపై కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఇటీవల ఒత్తిడి పెంచుతున్నది.