హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభుచౌహాన్ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మాసబ్ ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో కలిశారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, వెటర్నరీ డిపార్ట్మెంట్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు తీరును తెలుసుకునేందుకు ఆ శాఖ మంత్రి, అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ, వెటర్నరీ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి తలసాని, అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రభుచౌహాన్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో అమలవుతున్న పథకాలు తెలుసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చామన్నారు. పశువుల అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ..రాష్ట్రాలు పరస్పరంగా పథకాల అమలును తెలుసుకోవడంతో ఇరు రాష్ట్రాల రైతులకు లబ్ధి చేకూరుతుందననారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు..దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలవుతున్నాయన్నారు. 92 కోట్ల చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రతి సంవత్సరం
యాదవులు, కురుమలకు సబ్సిడీ గొర్రెలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. గొర్రెలకు ఉచిత వైద్యంతో పాటు ఇన్సూరెన్స్ కూడా చేయిస్తున్నామని, ఏడేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.