మాగనూరు : తెలంగాణలో అక్రమంగా ప్రవేశిస్తున్న కర్ణాటక ధాన్యం ( Karnataka grain ) లారీలపై ఎన్ఫోర్సుమెంట్ అధికారులు ( Enforcement Officials ) సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నారు. రాష్ట్రంలో జోరుగా ధాన్యం తరలివస్తున్న వాటిని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ- కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతమైన కృష్ణ వాసునగర్ చెక్‌పోస్టు ( Vasunagar Check Post ) అధికారుల అండతో నుంచి పదుల సంఖ్యలో ధాన్యం లారీలు తెలంగాణలోకి వస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వాసునగర్ చెక్‌పోస్టు నుంచి 7 వరి ధాన్యం లారీలు రాగా ఒక లారీని మాత్రమే మాగనూరు పోలీసులు నల్లగట్టు సమీపంలో పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి సంబంధిత ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు సమాచారం అందించారు.
అధికారులు శుక్రవారం వరి ధాన్యం లోడును పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోకుండానే కర్ణాటక పంపించారు. ఇదే విషయం ఎన్ఫోర్స్మెంట్ అధికారి డీటీ కాలప్పను వివరణ కోరగా తెలంగాణలోకి కర్ణాటక ధాన్యం లారీ మొదటిసారి వచ్చినందుకు ఆ లారీ యజమానిని హెచ్చరించి తిరిగి పంపించామని పేర్కొన్నారు.