మక్తల్ : ఎగువ నుంచి కృష్ణానదికి స్వల్పంగా వరద వస్తున్నది. నదీతీర ప్రాంతంలో వరి సాగు చేసిన రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. మంత్రి జూపల్లి, మక్తల్, గద్వాల, దేవరకద్ర ఎమ్మెల్యేలు శ్రీహరి, బండ్ల, మధుసూదన్‌రెడ్డి 15 రోజుల కిందట కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఇటీవల కలిశారు. నదీ తీరంలో పంటలు నీళ్లులేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేయ గా.. కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసింది.
మంగళవారం ఉదయం నాటికి జూరాల ప్రాజెక్టుకు 2,800 క్యూసెకుల వరద వచ్చి చేరింది. వరద వస్తుండటంతో భీమా ఫేజ్-1లో అంతర్భాగమైన చిట్టెం నర్సిరెడ్డి, భూత్పూర్ రిజర్వాయర్లకు నీటిని తరలించేందుకు చిన్న గోప్లాపూర్ స్టేజ్-1 పంప్‌హౌస్ వద్ద 650 క్యూసెకుల నీటిని పంపింగ్ ప్రారంభించారు.