Karnataka | నారాయణఖేడ్/పరిగి, అక్టోబర్ 28: కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయిన రైతులు తెలంగాణ ప్రజలను జాగృతం చేస్తున్నారు. నమ్మి ఓటేసిన తమను కాంగ్రెస్ నట్టేట ముంచిందని, మీరు ఆ తప్పు చేయొద్దంటూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. కర్ణాటకలోకి కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఎలా మోసం చేసిందీ వివరిస్తూ ప్రజలను ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, వికారాబాద్ జిల్లా పరిగిలో కర్ణాటక రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. పొరుగు రాష్ట్రంలోని బండారం ఎక్కడ బయటపడిపోతుందోననే భయంతో కాంగ్రెస్ నేతలు వారిని అడ్డుకుని దాడులకు కూడా పాల్పడ్డారు.
‘జనజాగృతి’ పాదయాత్ర
కర్ణాటకలోని బీదర్‌కు చెందిన దాదాపు 200 మంది రైతులు, మహిళలు నారాయణఖేడ్‌లో జనజాగృతి పేరుతో పాదయాత్ర నిర్వహించి కర్ణాటకలో కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించారు. పట్టణంలోని మంగల్‌పేట నుంచి బయలుదేరిన పాదయాత్ర రాజీవ్‌చౌక్ మీదుగా బసవేశ్వరచౌక్ వరకు సాగింది. ప్లకార్లులు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘాల నాయకులు దేవరాజ్‌గౌడ, సంజీవ్‌కుమార్ టొళ్లే, పెనినగౌడ, సోమనాథ్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమేనని పేర్కొన్నారు. వారిచ్చిన ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు.
8 గంటల కరెంటు, ‘గృహలక్ష్మి’ పథకం, 10 కిలోల ఉచితబియ్యం హామీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, నిరుద్యోగ భృతి వంటివన్నీ అటకెక్కిపోయాయని మండిపడ్డారు. తెలంగాణ రైతులకు ఆ పరిస్థితి రావద్దన్న సదుద్దేశంతోనే జనజాగృతి యాత్ర నిర్వహించినట్టు తెలిపారు. నారాయణఖేడ్‌లో బీదర్ రైతులు నిర్వహించిన జనజాగృతి పాదయాత్ర మాజీ ఎమ్మెల్యే పీ కృష్ణారెడ్డి నివాసం వద్దకు రాగానే అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీవైపు దూసుకొచ్చి దాడికి దిగారు. రైతుల చేతుల్లోని ప్లకార్డులు, ఫ్లెక్సీలు లాక్కుని చింపివేశారు.
దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగారు. వికారాబాద్ జిల్లా పరిగిలోనూ కర్ణాటక రైతులకు చేదు అనుభవం ఎదురైంది. పరిగిలోని కొడంగల్ క్రాస్‌రోడ్డు నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు రైతులు నిర్వహించిన ర్యాలీని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. తమ నాయకుడి ర్యాలీ రోజునే మీరు ఎలా ర్యాలీ చేస్తారని ప్రశ్నించారు. ఆధార్‌కార్డులు చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో అక్కడ వెనక్కి తగ్గినా గాంధీ విగ్రహం సమీపంలో మరోమారు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఐదేండ్లు తిప్పలు తప్పేలా లేవు
కాంగ్రెస్ మాటలు నమ్మి గెలిపించిన పాపానికి ప్రజలు మోసపోయారు. రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. చేసిన తప్పుకు ఐదేండ్లు కష్టాలు అనుభవించక తప్పదు. మాలా తెలంగాణ ప్రజలు మోసపోవద్దనే జనజాగృతి యాత్రతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. నారాయణఖేడ్ మా పొరుగు ప్రాంతమే కాబట్టి ఇక్కడి ప్రజలను చైతన్యం చేయడం బాధ్యతగా భావించి కాంగ్రెస్ మోసాలను ఇక్కడి ప్రజలకు తెలియజేస్తున్నాం.
– సంజీవ్‌కుమార్ టొళ్లే, కర్ణాటక