వనపర్తి : రైతు రాజ్యమే భారత రాష్ట్ర సమితి లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు రాజ్యం కోసం దేశంలోని రైతులందరినీ ఏకం చేస్తామని పేర్కొన్నారు. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదం బీజేపీకి చెమటలు పట్టిస్తున్నదని మంత్రి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డిని కర్ణాటక లోక్ జనశక్తి(పాశ్వాన్) రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జీ వెంకట్ రెడ్డి, ఎల్జేపీ కర్ణాటక యువజన అధ్యక్షులు నారాయణ కర్లి, మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ కులకర్ణి, న్యాయవాది శేఖర్ గౌడ, గణేష్ యాదవ్ , వీరేష్ రెడ్డి, గణేష్ కలిసి బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతు నినాదంపై చర్చ మొదలైందన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు మఖలో పుట్టి పుబ్బలో పోతుందని ఎద్దెవా చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించాం.. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిపామన్నారు. కేసీఆర్ తెలంగాణ దాటితే తమ పునాదులు కదలడం ఖాయమని బీజేపీ భయపడుతున్నదని నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తూ, నిధులకు మోకాలడ్డుతున్నదని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తెలంగాణ అభివృద్ధిని ఆపలేరని నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు.
త్వరలో రాయిచూర్ వేదికగా పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరికలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కర్ణాటక లోక్ జనశక్తి(పాశ్వాన్) రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జీ వెంకట్ రెడ్డికి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తాను స్వయంగా హాజరవుతానని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.