హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అత్యంత అనుకూల వాతావరణం ఎక్కడ ఉంటుంది అంటే టక్కున గుర్తొచ్చే నగరం పేరు.. హైదరాబాద్. అలాంటి నగరాన్ని ఏడున్నరేండ్లలోనే మోస్ట్ డైనమిక్ సిటీగా తీర్చిదిద్దింది.. టీఆర్ఎస్ సర్కారు. దేశంలో ఏ నగరం సాధించని వృద్ధి రేటు హైదరాబాద్ సాధిస్తున్నది. ఇతర మెగా సిటీలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత భద్రతలో, పచ్చదనం పెంపులో, ఆఫీస్ స్పేస్‌లో, ఐటీ కంపెనీలకు ఆహ్వానం పలకడంలో, స్టార్టప్‌లను నెలకొల్పడంలో హవా కొనసాగిస్తున్నది. ఎంతలా అంటే.. బెంగళూరును మించి. అలాంటిది.. హైదరాబాద్‌పై కర్ణాటక సీఎం బొమ్మై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేస్తే నెటిజన్లు ఊరుకుంటారా? ఓ ఆటాడుకొన్నారు. వారిలో ఎక్కువమంది ఆ రాష్ర్టానికి చెందిన నేతలు, నెటిజన్లే ఎక్కువ మంది కావటం గమనార్హం. ‘హైదరాబాద్ అభివృద్ధిని అంగీకరించలేకపోతున్నావా? బెంగుళూరుతో పోల్చితే హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రకటించిన విషయాన్ని మరిచిపోయావా? అని ప్రశ్నిస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్, బెంగళూరులో ఏది ఉత్తమం అనే అంశంపై మంగళవారం ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మధ్య చర్చ జరిగింది. మధ్యలో కల్పించుకొన్న కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై ‘కర్ణాటక దేశంలోనే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. బెంగళూరులో పని చేసేందుకు ప్రపంచ దేశాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అలాంటిది హైదరాబాద్‌ను బెంగుళూరుతో పోల్చడం పెద్ద జోక్’ అని అనుచితంగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.
హైదరాబాద్ అద్భుతం. విమానాశ్రయం నుండి హైటెక్ సిటీకి రోడ్డు బాగుంటుంది. రాజధాని నగరం అంటే అలా ఉండాలి. వ్యాపారానికి ఎంతో అనుకూలమైంది. పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది.
– హరిణి కలమూరు
బొమ్మై అండ్ కో హిజాబ్, హలాల్‌తో బిజీగా ఉండగా, కేటీఆర్ మాత్రం హైదరాబాద్‌కు పారిశ్రామికవేత్తలను, స్టార్టప్‌లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేటీఆర్ మాదిరిగా తెలివిగా వ్యవహరించాలి. బెంగళూరుతో పోల్చితే హైదరాబాదే ఉత్తమ నగరం – సమీర్ కపూర్
మెరుగైన సామాజిక వాతావరణం కోసం, స్టార్టప్‌లకు మెరుగైన మౌలిక సదుపాయాల కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని ఇతరులకు మేం సూచిస్తున్నాం. కర్ణాటక ప్రభుత్వం నుంచి వచ్చే మరికొన్ని ఆర్థిక జిహాద్‌లు మాకు పెట్టుబడులు లేదా ఉద్యోగాలు రాకుండా చూస్తాయి.
-కర్ణాటక మాజీ ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే