హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరస్టైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి చెందిన కర్ణాటకలోని బినామీ ఆస్తుల వివరాలు తేలాల్సి ఉన్నదని ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నది. సోదాల సమయంలో భీమ్‌రెడ్డి ఇంట్లో రెండు మెమొరీ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నామని, అందులోని వివరాల ఆధారంగా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. భీమ్‌రెడ్డి దగ్గర ఒక డైరీ కూడా స్వాధీనం చేసుకున్నామని, అందులో ‘మనకు ఇవ్వాల్సిన వాళ్లు’ ‘నేను ఇవ్వాల్సినవి’ అంటూ రాసుకున్నట్టు చెప్పారు. సోదాల్లో పది బ్యాంకు ఖాతాలు, రెండు లాకర్లు గుర్తించామని, వాటిని పూర్తిస్థాయిలో తనిఖీ, స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నదని అన్నారు.
భీమ్‌రెడ్డికి చెందిన కొన్ని ఆస్తులను తన మొబైల్లో స్క్రీన్‌షాట్ తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. జహీరాబాద్‌లో హోమ్‌గార్డు లక్ష్మణ్ పేరున మూడెకరాలు, కర్ణాటకలో ఆరెకరాల వ్యవసాయ భూమి ఉన్నదని గుర్తించారు. కర్ణాటకలోనే మరో 30 ఎకరాలు, బెంగళూరు దేవనహళ్లి వద్ద 11 ఎకరాలు, కామినేని హాస్పిటల్(ఎల్బీనగర్) వద్ద 200 గజాల ప్లాట్, పటాన్చెరు బిలియన్ హౌసింగ్ సొసైటీ వద్ద ఇంద్రకరణ్‌రెడ్డి పేరు మీద 400 గజాల ప్లాట్, పటాన్చెరులో నర్వ ఎంఎస్ఎన్ కంపెనీ పేరు మీద ఉన్న 2,000 గజాల స్థలం వంటి వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సి ఉన్నదని కోర్టుకు చెప్పారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.