ఇల్లందకుంట, మార్చి 21 : భార్య మరణాన్ని తట్టుకోలేక కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ది జయశంకర్భూపాలపల్లి. పదేండ్ల క్రితం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్యను వివాహం చేసుకున్నాడు. వీరికి అశ్వధ, అభిమన్యు ఇద్దరు కుమారులు. ఐదు రోజుల క్రితం దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. దివ్య మృతదేహాన్ని సీతంపేటకు తీసుకురాగా.. చంద్రశేఖర్ వేధింపులతోనే ఆమె ఆత్మహత్యచేసుకున్నదని గ్రామస్తులు ఆందోళన చేశారు. తన కూతురు కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నదని దివ్య తండ్రి సమ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆందోళనకు తెరపడింది.
భార్య అంత్యక్రియలు జరిగినప్పటి నుంచి ఎస్ఐ చంద్రశేఖర్ అత్తవారి ఇంట్లోనే ఉంటున్నాడు. శనివారం ఐదో రోజు కార్యక్రమంలో భాగంగా పక్షికి పెట్టి ఇంటికి తిరిగివచ్చాడు. అనంతరం గదిలోకి వెళ్లి భార్య చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మృతితో తన కొడుకు తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రశేఖర్ తండ్రి మల్లయ్య ఫిర్యాదు చేసినట్టు ఏసీపీ మాధవి పేర్కొన్నారు. మృతదేహాన్ని జమ్మికుంట దవాఖానకు తరలించినట్టు తెలిపారు. భార్య అంత్యక్రియలు జరిగిన సీతంపేటకు చంద్రశేఖర్ మృతదేహాన్ని తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలయ్యారు.