సైదాపూర్, జూన్ 5 : భూమి సర్వే కోసం రూ.పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ సర్వేయర్. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం అమ్మనగుర్తికి చెందిన ఓ రైతు తన భూమి సర్వే చేయాలని మండల సర్వేయర్ కుమారస్వామిని సంప్రదించగా, రూ. 25 వేలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు ఒకసారి రూ. 5 వేలు, రెండోసారి రూ.10 వేలు మొత్తం రూ.15 వేలు ఇచ్చాడు. మిగతా రూ. 10 వేలు ఇస్తేనే భూమి సర్వే చేస్తానని చెప్పడంతో విసిగిపోయిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
సర్వేయర్ కుమారస్వామికి డబ్బులు ఇస్తానని రైతు చెప్పడంతో శుక్రవారం తన ప్రైవేట్ అసిస్టెంట్ రాజేశ్‌తో కలిసి వచ్చాడు. సోమారం క్రాసింగ్ వద్ద రాజేశ్ సదరు రైతు నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు సర్వేయర్ కుమారస్వామితోపాటు ప్రైవేట్ అసిస్టెంట్లు రాజేశ్, విహిత్రెడ్డిపై కేసు నమోదు చేసి, వారిని కరీంనగర్‌కు తరలించారు.