కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 22: అడవుల పెంపకం, సంరక్షణలో కరీంనగర్ జిల్లా దేశానికే రోల్ మాడల్‌గా నిలుస్తున్నదని జలశక్తి అభియాన్ కేంద్ర నోడల్ అధికారి, నీతి అయోగ్ బృందం డిప్యూటీ సెక్రటరీ షోయబ్ అహ్మద్ కలాల్ స్పష్టం చేశారు. నీటి నిల్వ, అవసరం మేరకు వాడుకోవడం, వృథాను అరికట్టడంలో అద్భుతమైన పనితీరు కనబర్చిందని కొనియాడారు. శనివారం కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో భూగర్భ జలవనరుల శాఖ, డీఆర్డీవో, నీటి పారుదల శాఖ, అటవీ శాఖాధికారులతో జిల్లా ప్రగతిపై సమీక్షించారు. జిల్లాలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వాటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నీటి సంరక్షణ బాధ్యతలు చేపట్టి, కొనసాగించాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతు మొత్తం వరి పంట సాగుచేస్తున్నారని, దీనికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అధికార యంత్రాంగం ప్రోత్సహించాలని చెప్పారు.
బెంగళూరు వంటి మహానగరంతో అభివృద్ధిలో కరీంనగర్ పోటీ పడుతున్నదని, ఉత్తర భారతదేశ నగరాల కన్నా ముందు వరుసలో ఉన్నదని ప్రశంసించారు. జిల్లాలోని ప్రతి గ్రామం పారిశుధ్యం, పచ్చదనం, వ్యవసాయం తదితర అంశాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించి ముందువరుసలో నిలిచిందన్నారు. నీటి నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అద్భుతమని కొనియాడారు. జిల్లాలో 75 అమృత్ సరోవర్ నిర్మాణాలు చేపట్టగా, ఇప్పటివరకు ఎనిమిది పూర్తి అయినట్టు తెలిపారు. మిగిలిన వాటిని కూడా తొమ్మిది నెలల్లో పూర్తిచేయాలని సూచించారు. జిల్లా ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్న జిల్లా అధికార యంత్రాంగాన్ని కొనియాడారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీఆర్డీవో ఎల్ శ్రీలతరెడ్డి పాల్గొన్నారు.