Ponguleti Srinivas Reddy | కరీంనగర్, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై ఇటీవల మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంప్లాయీస్ జేఏసీ మండిపడింది. ఐఏఎస్‌లను, అధికారులను, ఉద్యోగులను ఎవరైనా పరుష పదజాలంతో మాట్లాడినా, అవమాన పరిచినా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించింది. ‘కలెక్టర్ మనస్సు చివుక్కుమనేలా కన్నీరు పెట్టించిన ఎవరికైనా మా ఉద్యోగుల శాపం తగులుతది.. మా సహనాన్ని పరీక్షించొద్దు.. మేము తలుచుకుంటే ఏ ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నడో సవివరంగా ప్రజలకు వివరించే సత్తా మా ఉద్యోగులకు మాత్రమే ఉన్నదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’ అని తేల్చిచెప్పింది. ఇటీవల కలెక్టర్ పమేలా సత్పతి విషయంలో మంత్రి పొంగులేటి మాట్లాడిన తీరును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ కరీంనగర్‌లోని టీఎన్జీవో భవన్లో మంగళవారం సమావేశమైంది. జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రతికా ప్రకటనలో మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతమైతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కన్నీరు పెడుతున్నదని, ప్రజాస్వామ్యవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు బాధపడుతున్నారని, స్వార్థ రాజకీయ క్రీడలకు ప్రభుత్వోద్యోగులను బలిచేయొద్దని అసహనం వ్యక్తంచేశారు. ఎక్కడ నలుగురు ప్రభుత్వోద్యోగులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రొఫెసర్లు గుమిగూడినా ‘మా జిల్లా కలెక్టర్ చేసిన తప్పేమిటి?’ అని మధన పడుతున్నారని, ఇంత జరిగినా ఉద్యోగ సంఘ నాయకులుగా మీరేం చేస్తున్నారంటూ తమను ప్రశ్నిస్తున్నారని వాపోయారు. ఉద్యోగులందరినీ కలుపుకొనిపోతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకాన్నీ ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థంగా అమలు చేస్తూ కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతిపై అనాలోచితంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఉద్యోగులపై పరుష పదజాలంతో విరుచుకుపడటం పదవిలో ఉన్న వారికి తగదని, తమ ఉద్యోగులంతా అభద్రత.. భయంతో ఉన్నారని పేర్కొన్నారు.
రాత్రింబవళ్లు కష్టపడి అలుపెరగకుండా కృషిచేసి ఎన్నో పోటీ పరీక్షలను ఎదుర్కొని ఈరోజు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా బాధ్యతాయుతమైన ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్నారని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్‌పై మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో తమ మద్దతు మంత్రికి ఉండదంటూ తేల్చిచెప్పారు. ‘ప్రజలు, ప్రభుత్వోద్యోగుల విశ్వాసం ఉన్నంతవరకే మీరు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతారు. ప్రభుత్వోద్యోగులు రేపు పై స్థాయి అధికారులు అవుతరు.. ఐఏఎస్‌లు ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు అవుతరు.. ప్రజల విశ్వాసం కోల్పోయిన రోజు మీరు మళ్లీ వచ్చి మా ఉద్యోగులు, ఐఏఎస్ అధికారుల అపాయింట్మెంట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు వస్తయి.. చరిత్ర అందరికీ గుణపాఠం చెప్తది’ అని హితవుపలికారు. ‘ఉద్యోగులుగా మేము ప్రజలకు జీతగాళ్లం.. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తం. మీ రాజకీయ క్రీడ కోసం మా ఉద్యోగులను బలి చేయొద్దు.. రాజకీయాల్లోకి లాగొద్దు’ అని సూచించారు. ఈ విషయాన్ని రాష్ట్ర జేఏసీ దృష్టికి సోమవారం తీసుకెళ్లినట్టు వివరించారు.
రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని (ముజీబ్ ) మాట్లాడారని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని, అలా జరిగితే ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారని తెలిపారు. సమావేశంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావు, టీజీవో అధ్యక్షుడు మడిపేల్లి కాళి చరణ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, డీడీ నాగరాజు, కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు నాగుల నరసింహ స్వామి, అసోసియేట్ అధ్యక్షుడు వొంటెల రవీందర్ రెడ్డి, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, మహిళా జేఏసీ చైర్మన్ శారద, డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు మంజీత్ సింగ్, ఎండీ వారిస్ సవాబ్, టౌన్ అధ్యక్షులు మారుపాక రాజేశ్ భరద్వాజ్, కార్యదర్శి సుమంత్ రావు, తిమ్మాపూర్ అధ్యక్షుడు పోలు కిషన్, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి కార్యదర్శి లింగయ్య నాయకులు సబిత, సునీతా, విజయ లక్ష్మి, మల్క రాజేశ్వరరావు, ట్రెజరీ సంఘం ఉద్యోగులు కొండయ్య, పంచాయతీ సెక్రటరీల సంఘం అధ్యక్షుడు అజయ్, జడ్పీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ప్రవీణ్, అభిషేక్, గిరిధర్ రావు, సత్యం అనీల్, నగేశ్ గౌడ్, బోనాల రవి, అజయ్, బాలాజీ, అంజయ్య, రమేశ్, వహీస్ పాల్గొన్నారు