నమస్తే తెలంగాణ, నెట్వర్క్, అక్టోబర్ 27: పోస్టు కార్డు ఉద్యమం ఉధృతమవుతున్నది. నూలు, తయారీ బట్టపై ఇప్పటికే 5 శాతం టాక్స్ విధించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరో 7 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, చేనేతపై మొత్తం జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో నేత కార్మికులు నిరసనను ఉధృతం చేశారు. గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలుచోట్ల ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తరాలు పంపారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో మోదీకి పోస్టుకార్డులు రాసి నిరసన తెలిపారు. వెల్గటూర్ మండల కేంద్రంలో పద్మశాలీలు పోస్టు కార్డు ద్వారా మోదీకి లేఖలు రాశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో జడ్పీటీసీ, రాష్ట్ర పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షుడు బొద్దుల లక్ష్మణ ఆధ్వర్యంలో పద్మశాలీ సంఘం నాయకులు జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి పోస్టుకార్డులు రాశారు. ధర్మారం మండలం ఖిలావనపర్తి చేనేత కార్మికులు ప్రధానికి పోస్టు కార్డులు రాసి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్కులో అసోసియేషన్ అధ్యక్షుడు అన్నల్దాస్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం చేనేతపై విధించిన 5శాతం జీఎస్టీ పన్ను రద్దుకు మూకుమ్ముడిగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి పోస్టుకార్డు రాశారు. వెంటనే జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.