TS Minister Gangula | సంక్షేమ పథకాల అమలుతోపాటు మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధిని సాధించడంలో కరీంనగర్ జిల్లా ముందుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం జిల్లా స్థాయి జాతీయ పంచాయితీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని 11 మండలాల్లోని 27 గ్రామ పంచాయితీలలో ప్రగతి సాధించిన గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పంచాయితీ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా ప్రతి రంగంలో మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధిని సాధించిందన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషిచేసి విజయవంతం చేశారన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పల్లెల స్వరూపం పూర్తిగా మారిపోయిందన్నారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. జిల్లాలో ఇప్పటికే అద్భుతమైన రోడ్లు, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, మెడికల్ కళాశాల ఏర్పాటు, ఆధ్యాత్మికతను పెంపొందించేలా వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏర్పాటు చేసుకున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, మానకొండూర్, చొప్పదండి శాసనసభ్యులు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, సుడా ఛైర్మెన్ జీవీ రామకృష్ణ రావు, అదనపు కలెక్టర్లు జీవీ శ్యామప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, ట్రైనీ కలెక్టర్లు లెనిన్ వాత్సల్ టొప్పో, డీపీఓ వీరబుచ్చయ్య, డీఆర్డీఓ శ్రీలత రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, డీడబ్ల్యూఓ సబిత, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.