కరీంనగర్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కరీంనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బండి సంజయ్‌ను కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు పోలీసులు తరలించారు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 17వ తేదీ వరకు బండి సంజయ్‌తో పాటు కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్‌కు కోర్టు జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. మరో 11 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
317 జీవో పేరుతో ఆదివారం రాత్రి కరీంనగర్లో జాగరణ పేరుతో దీక్ష చేపట్టారు. అయితే కొవిడ్ నిబంధనలు అతిక్రమించి దీక్ష చేపట్టరాదని పోలీసులు నోటీసు జారీ చేసినా వినలేదు. దీంతో మూడు గంటల హైడ్రామా తర్వాత బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ నుంచి కరీంనగర్ కోర్టుకు తరలించి హాజరు పరిచారు.
బండి సంజయ్‌ను కోర్టులో హాజరు పరిచేకంటే ముందు కరీంనగర్ సీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా దీక్ష చేపట్టిన బండి సంజయ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బండి సంజయ్ తన దీక్షలో కొవిడ్ నిబంధనలు పాటించలేదు. మాస్కులు ధరించని 25 మందిపై కేసు నమోదు చేశామన్నారు. పొలీసులపై కొంతమంది యువకులు దాడులకు పాల్పడి విధులకు ఆటంకం కలిగించారు. ఈ క్రమంలో 16 మందిపై విపత్తు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. 60 మందిని విడుదల చేసి నోటీసులు ఇచ్చాం. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా సభలు, సమావేశాలకు అనుమతి లేదు అని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.