శేరిలింగంపల్లి, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కొండాపూర్‌లో కన్నడ నటి శోభిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గచ్చిబౌలి సీఐ హబీబ్ ఉల్లా ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం కన్నడ నటి శోభిత తన భర్త సుధీర్‌తో కలిసి కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ సీ బ్లాకులో నివాసం ఉంటున్నారు. కన్నడ సినిమా, సీరియల్స్‌లో నటించిన శోభిత పెళ్లి తర్వాత నటించడం మానేశారు. భర్త ఐటీ కారిడార్లోలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండడంతో నగరానికి వచ్చారు. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శోభిత బెడ్రూంలో సీలింగ్ప్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సీఐ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.