హుజూరాబాద్, అక్టోబర్ 11: బీజేపీ నేత ఈటల రాజేందర్లో కనపడని అపరిచితుడున్నాడని.. పైకి కనిపించేంత నీతిమంతుడు కాదని.. విజయలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ నిర్వాహకురాలు కన్న శివకుమారి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం హుజూరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు తనకు తీరని అన్యాయం చేశారని, తీవ్రంగా వేధించారని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ముడుపులు ఇవ్వలేదని కక్షగట్టి తన జీవితాన్ని రోడ్డుపాలుచేశాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఈటల పౌరసరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు కందిపప్పు సరఫరాకు టెండర్ దక్కించుకొన్న తాను.. రంగారెడ్డి, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు వంద టన్నుల పప్పును సరఫరాచేశామని, రాష్ట్రవ్యాప్తంగా సరఫరాచేద్దామనుకొన్న తరుణంలో కమీషన్లు ఇవ్వలేదని.. తన కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టారని తెలిపారు. సరఫరాచేసిన కందిపప్పుకు రూ.2 కోట్లు ప్రభుత్వం నుంచి రాకుండా అడ్డుపడ్డారని వెల్లడించారు. ఆరేండ్లుగా ఈటల తన చుట్టూ తిప్పించుకోవడమే కాకుండా తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ‘కందిపప్పు సప్లయ్‌లో కోట్ల రూపాయల అవినీతి జరుగలేదని, బిజినెస్ పరంగా.. ఆర్థిక పరంగా.. మానసికపరంగా నా జీవితాన్ని బజారు పాలు చేయలేదని ఇల్లందకుంట శ్రీసీతారామస్వామి వారి సాక్షిగా ప్రమాణం చేయడానికి ఈటల సిద్ధమా?’ అని శివకుమారి సవాలు విసిరారు. పౌరసరఫరాల మంత్రిగా ఉన్న సమయంలో ఈటల రెండు వేల కోట్లకుపైగా వెనకేసుకొన్నారని తెలిపారు. ఈ విషయమై 2014 నవంబర్ 14న అప్పటి విజిలెన్స్ కమిషనర్ అమిత్ గార్గ్‌కు ఫిర్యాదుచేశానని అయినా తనకు న్యాయం జరుగలేదని వాపోయారు.
ముడుపులు ఇవ్వలేదని కక్ష గట్టాడు
కందిపప్పు సరఫరా విషయంలో ఈటలకు ముడుపులు ఇవ్వలేదని తనపై కక్షగట్టారని శివకుమారి చెప్పారు. ఈటల పౌరసరఫరాల మంత్రిగా ఉన్న సమయంలో 2014 ఆగస్టులో జరిగిన టెండర్లో రూ.కోటీ 97 లక్షల యాభై వేలకు కందిపప్పు సరఫరా ఆర్డర్ తనకు దక్కిందని చెప్పారు. నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని పౌరసరఫరాశాఖలో డిపాజిట్ చేశానన్నారు. వెయ్యి టన్నులను తక్షణమే సరఫరా చేయడానికి 2014 సెప్టెంబర్ 13న సంబంధితశాఖ నుంచి తనకు ఆర్డర్ కాపీ వచ్చిందని చెప్పారు. కంది పప్పును ఆంధ్రా నుంచి కొనుగోలు చేసి తీసుకురావడానికి అదనంగా మరో రూ.2 కోట్లు సమకూర్చుకోవాల్సి వచ్చిందని, కానీ తనకు టెండర్ వచ్చిన సమయంలోనే ఆంధ్రాప్రాంతంలో హుద్‌హుద్ తుఫాన్ రావడం వల్ల కందిపప్పు ఎగుమతి ఆగిపోయిందని వెల్లడించారు. కొంత ఆలస్యమైనప్పటికీ.. 2014 సెప్టెంబర్ 30 నుంచి 2014 అక్టోబర్ 5 వరకు రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు 100 టన్నుల కందిపప్పును సరఫరా చేశామని చెప్పింది. తరువాత రెండు రోజుల వ్యవధిలోనే మరో వందటన్నుల కందిపప్పును ఇతర జిల్లాలకు పంపించినప్పటికీ, క్వాలిటీ లేదంటూ కుంటిసాకు చెప్పి అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈటల వెనక్కి పంపించారని.. ఆ తరువాత సప్లయ్‌లో ఆలస్యం జరుగుతున్నదంటూ సెప్టెంబర్ 24న షోకాజ్ నోటీసు జారీ చేయించి వేధింపులకు తెర తీశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసుకు జవాబిచ్చినా, అక్టోబర్ 10న మరో నోటీసు జారీ చేశారన్నారు. ఇరవై రోజులు గడువు ఇస్తే సప్లయ్ చేస్తామని, 2014 అక్టోబర్ 15న లిఖితపూర్వకంగా ఈటలను వేడుకోగా, ఏమాత్రం కనికరించకుండా తాము డిపాజిట్ చేసిన రూ.కోటి 97 లక్షల 50 వేల బ్లాక్ లిస్ట్ (ఫోర్ ఫీటెడ్ )లో పెట్టించారని ఆరోపించింది. విసిగివేసారిన తాము వ్యాపారం చేయలేమని, తమ డబ్బు తిరిగి ఇప్పించాలని ఈటల ఇల్లు, కార్యాలయం చుట్టూ ఏండ్ల తరబడి తిరిగినా స్పందించకపోగా, తన క్యారెక్టర్‌ను కించపరిచేలా మాట్లాడారని పేర్కొంది. ‘నా వెంబడి తిరుగుతున్న నా భర్తను అతను, మీ ఆయనేనా.. ఇంకెవరైనానా?’ అని అభ్యంతకరంగా మాట్లాడాడు. అప్పుడే నాకు చనిపోవాలనిపించింది. కోపం ఆగలేక నాశనమైపోతావని దుమ్మెత్తిపోసి వచ్చా’ అని విమర్శించారు.
మురిగిపోతున్న రూ.2 కోట్లు
పౌరసరఫరాలశాఖలో తమ డిపాజిట్ మురిగిపోతున్నదని, అప్పులు తీర్చడానికి రెండు ఇండ్లను అమ్ముకొన్నామని, మరో రూ.2 కోట్ల అప్పు మిగిలి ఉన్నదని శివకుమారి వెల్లడించారు. తనను అడ్డుకొన్న ఈటల మరో 3 కంపెనీలకు ఎక్కువ రేటుకు ఆర్డర్ ఇచ్చి.. వారు సకాలంలో సైప్లె చేయలేకపోయినా.. చర్యలు తీసుకోకుండా చోద్యం చూశారని తెలిపారు. టెండర్ దక్కించుకొన్న వాసవీ దాల్ మిల్ నాసిరకం పప్పును సైప్లె చేస్తే.. ఆ కంపెనీ డిపాజిట్ చేసిన రూ.4 కోట్లను బ్లాక్‌లిస్టులో పెట్టినట్టే పెట్టి.. రెండు నెలల తరువాత రూ.17 లక్షల జరిమానా విధించి మిగతా మొత్తాన్ని ఈటల దగ్గరుండి రిలీజ్ చేయించారని చెప్పారు. సివిల్ సైప్లె శాఖలో ఉద్యోగులందరికీ ఈటల అవినీతి బాగోతం బాగా తెలుసన్నారు. టీఆర్ఎస్ అంబర్‌పేట ఇంచార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి ద్వారా సీఎం కేసీఆర్‌ను కలిసి ఫిర్యాదుచేస్తే సీవీ ఆనంద్ ను సివిల్ సైప్లెస్ కమిషనర్‌గా నియమించి.. విచారణ జరిపించి కందిపప్పు సరఫరాను నిలిపివేశారని పేర్కొన్నారు. ‘నా భర్త వెంకట్‌తో కలిసి ఈటల దగ్గరికి వెళితే.. ఇతనా నీ భర్త.. ఇంత పెద్ద బిజినెస్ చేసేందుకు డబ్బు నీకెకడిది? సీఎంకు ఫిర్యాదు చేశావుగా.. ఇక నా దగ్గరకు ఎందుకు వస్తున్నావ్? మళ్లీ సీఎం దగ్గరకే వెళ్లు.. విజయలక్ష్మి ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌లో నీ డబ్బంటు ఒక రూపాయి పెట్టుబడి లేదు.. ఈ ఫైల్ సిద్ధం చేయడానికి బ్రోకరేజ్ (కమీషన్) తీసుకున్నావ్’.. అని ఈటల నానా బూతులు తిట్టాడని ఆమె పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు చేతులెత్తి దండం పెడుతున్నానని.. ఈటలకు ఓటు వేయొద్దని శివకుమారి వేడుకొన్నారు.