హైదరాబాద్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): కొత్త రాతియుగంనాటి కంకణశిల (రింగ్ స్టోన్)ను ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలం భూపతిపూర్ గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇది ఆరువేల ఏండ్లనాటిదని అంచనా వేసింది. గతంలో వృక్షశిలాజాలు దొరికిన ప్రదేశంలోనే ఇది లభించిందని తెలిపింది. ఇనుమును కనుగొనని కాలంలోనే కఠినమైన డోలరైట్ రాయిని కంకణశిలగా మలచడం ఎలా సాధ్యమైందో అర్థం కావడంలేదని బృందం పేర్కొంది.
ఈ రాతిపరికరం తవ్వుకోల మీద, వలలను ముంచే బరువుగా, పూసలకు మెరుగుపెట్టడానికి ఆధారంగా ఉపయోగపడేదని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఇలాంటి శిలను గతంలో కర్ణాటక రాష్ట్రం బళ్లారి సమీపంలోని సంగనకల్లులో ప్రఖ్యాత చరిత్రకారుడు, ప్రొఫెసర్ రవి కొరిసెట్టర్ తవ్వకాల్లో సేకరించినట్టు, అది ప్రస్తుతం బళ్లారి మ్యూజియంలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ పరిశోధనల్లో సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, చీడం రవి తదితరులు పాల్గొన్నారు.