పటాన్చెరు రూరల్, జూన్ 9 : ఇక్రిసాట్ సంస్థ సరికొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది. 125 రోజుల్లోనే కందిపంట చేతికి వచ్చేలా వంగడాన్ని రూపొందించింది. ఇక్రిసాట్ ప్రధాన కార్యాలయం, పరిశోధన కేంద్రంలో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇక్రిసాట్ అభివృద్ధి చేసిన కొత్త వంగడంతో 125 రోజుల్లోనే కంది పంట చేతికి వస్తుందని తెలిపారు. ఐసీపీవీ 25444 అనే రకం కంది విత్తనాన్ని అభివృద్ధి చేసి రైతులకోసం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.
యాసంగిలో ఈ రకం కంది పండుతుందని పేర్కొన్నారు. నాలుగైదు నీటి తడులు సరిపోతాయని తెలిపారు. దేశంలోని అనేక రాష్ర్టాల్లో ఈ పంటను పండించే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. కంది సాగులో ఇదో విప్లవాత్మక మలుపుగా హిమాన్షు పాఠక్ అభివర్ణించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డాక్టర్ స్టాన్ఫర్డ్ బ్లేడ్, విజయేంద్ర పాల్గొన్నారు.