నీలగిరి, జనవరి 22 : నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం తనపై, బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్, దూదిమెట్ల బాలరాజు, ఇస్తావత్ రాంచంద్రనాయక్, మేడే రాజీవ్సాగర్తో కలిసి ఆయన ఎస్పీ శరత్చంద్రపవార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పల్లె రవికుమార్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సభ జరిగితే కాంగ్రెస్ మోసాలు అందరికీ తెలుస్తాయనే ఉద్దేశంతోనే సభను అడ్డుకున్నారని విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో దాడిచేయడం దారుణమని మండిపడ్డారు.