హైదరాబాద్, జూన్ 15 (నమస్తేతెలంగాణ): గద్దర్ సినీ అవార్డులను మరో నంది అవార్డుగా మార్చేశారా? అని గద్దర్ మిత్రుడు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణలో ఆడి, పాడిన వందలాది మంది కళాకారులు, ప్రజా గాయకులు, పాటల రచయితలను గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మరచిపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సినిమా నటులు, రాజకీయ నాయకుల వ్యవహారంగా మారిందని ధ్వజమెత్తారు. ‘నేను గద్దర్‌కు చాలా దగ్గరి మిత్రుడిని. గద్దర్‌ను కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ఒప్పించినవాడిని. నాతో సహా చాలామందికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. నేను రాహుల్‌గాంధీకి, తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాను. అందుకు ప్రతిగా దూషణలు, బెదిరింపులు ఎదురొంటున్నా.. అని తెలిపారు.
గద్దర్ పేరిట అవార్డు ప్రకటించడం ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతిలో కొత్త విప్లవం మొదలవుతుందని భావించా, కానీ సినిమా రంగాన్ని ఏయే కులాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయో, వారు తెలంగాణ సంస్కృతి పట్ల ఎలాంటి వైఖరితో ఉంటారో కూడా తెలుసునని పేర్కొన్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న సినిమా సంస్కృతిని మార్చి, ఫూలే తరహా కొత్త తెలుగు సినిమా నిర్మాణ సంస్కృతిని తీసుకురావాలని ఆశించామని తెలిపారు. అటువంటి అంశాలు ఎకడా కనిపించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అవార్డు జ్యూరీలో ఒక జానపద కళాకారుడు కూడా లేడని, అందరూ సినిమా కళాకారులే ఉన్నారని, ప్రజల కళలకు ప్రాతినిధ్యం ఎకడ? జ్యూరీలో గద్దర్ సాంస్కృతిక ప్రతినిధి ఎకడ? పొడుస్తున్న పొద్దుమీద’ అనే పాటకు ప్రాతినిధ్యం వహించే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కళాకారులు ఎకడ? అని ప్రశ్నించారు.