హైదరాబాద్ సిటీబ్యూరో, కొండాపూర్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కంచె గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థిలోకం భగ్గుమన్నది. వారి పోరాటానికి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఆందోళనలు, నిరసనలు, బుల్డోజర్ల చప్పుళ్లు, పోలీసుల అరెస్టులతో వర్సిటీ ప్రాంగణమంతా దద్దిరిల్లింది. విద్యార్థులు, నాయకుల నినాదాలతో అట్టుడికింది. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలు, విద్యార్థి సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలను యూనివర్సిటీ వద్దకు రానీయకుండా ఎక్కడికక్కడ పోలీసులు హౌజ్ అరెస్ట్‌లు చేశారు.
విద్యార్థులు క్యాంపస్ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. సోమవారం రాత్రి నుం చి విద్యార్థులు యూనివర్సిటీ మెయిన్ గేటు ముందే బైఠాయించి నిరసనలు చేపట్టారు. వి ద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ, సీపీ ఎం, సీపీఐ, వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు భారీ ఎత్తున చేరుకుని మద్దతు తెలిపారు. వర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వందలాదిగా మోహరించిన పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని వ్యాన్లలోకి ఎక్కించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేయడంతో మెయిన్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.
విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు బయలుదేరిన బీఆర్ఎస్, బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులను హౌజ్ అరెస్ట్ చేశారు. హెచ్సీయూకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు 68 మందిని అరెస్ట్ చేసి రాయదుర్గం, రాజేంద్రనగర్, నార్సింగి, గబ్చిబౌలి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
న్యూస్ నెట్వర్క్: హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ కేబీఆర్ పార్కు ముందు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టన నిరసన ప్రదర్శనలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పాతూరి సుధాకర్‌రెడ్డి, సినీ సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొని జీవవైవిధ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చిక్కడపల్లిలో ఎమ్మెల్యే ముఠాగోపాల్ పాల్గొన్నారు. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో వివిధ విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఉమ్మడి వరంగల్జిల్లావ్యాప్తంగా ఆందోళనకు దిగిన సీపీఎం నాయకులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు.
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణతోపాటు ఇతర విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివెళ్తున్న బీఆర్ఎస్వీ, సీపీఎం, డీవైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులను ఖమ్మం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసులు అడ్డుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్యర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల్లోనూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినదించారు. రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినదించారు. విద్యార్థులకు మద్దతు తెలపడానికి వచ్చిన నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తుండటంతో ‘పోలీస్.. గో బ్యాక్’ అంటూ పెద్దపెట్టున నినదించారు. దీం తో విద్యార్థులందరినీ క్యాంపస్ లోపలికి నెట్టేసి మెయిన్ గేట్‌కు తాళం వేశారు. విద్యార్థులు గేటు ముందే ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): జీవవైవిధ్యానికి నెలవైన హెచ్‌సీయూ భూములను జేసీబీలతో ధ్వంసంచేసి ప్రభుత్వం అమ్ముకోవాలని చూడటం దారుణమని ఎన్ఎస్యూఐ నాయకులు విమర్శించారు. క్యాంపస్ పరిధిలోకి వచ్చిన జేసీబీలను అడ్డుకోబోయిన విద్యార్థులను ఈడ్చుకుంటూ అక్రమంగా అరెస్టులు చేయ డం తగదని మండిపడ్డారు. ఎన్ఎస్యూఐ హెచ్‌సీయూ విభాగం నాయకులు మంగళవారం మీడియాతో మాట్లాడారు. వర్సిటీ భూములపై విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా జేసీబీలను రంగంలోకి దింపడం సరికాదని పేర్కొన్నారు.
హెచ్సీయూకు నాడు ఇందిరమ్మ 2,300 ఎకరాలు ఇచ్చారని గుర్తుచేశారు. ‘ఇందిరమ్మ పాలన అంటూ అధికారం చేపట్టి బుల్డోజర్ రాజ్యం నడపడం సరికాదు’ అని హితవు పలికారు. తాజా ఘటనపై వర్సిటీ రిజిస్ట్రార్, వీసీ ఎందుకు అధికారిక ప్రకటనలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. క్యాంపస్‌లో ఏం జరుగుతున్నదో తమకు తెలపాల్సిన అవసరం ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ పరిధిలోకి బుల్డోజర్లను తీసుకు రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.