Kamareddy | నిజామాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి జిల్లాలో ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌తో పాటు మరో యువకుడు మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. ఎస్సై సాయికుమార్ (33)కు వృత్తిపరంగా మంచి జీవితం ఉంది. గర్భిణి అయిన భార్య, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గాంధారి మండలానికి చెందిన కమ్మరి శ్రుతి (32) 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ఆమెకు గతంలోనే విడాకులు అయ్యాయి. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నది. బీబీపేటలో పని చేసే సమయంలో ఎస్సై సాయికుమార్‌తో శ్రుతికి పరిచయం ఏర్పడింది. బీబీపేట సొసైటీ ఆపరేటర్ నిఖిల్ (29)తో శ్రుతికి స్నేహం ఉంది. శ్రుతి కంటే వయసులో చిన్నవాడైన అతడు, ఆమెను పెండ్లి చేసుకోవాలని అనుకున్నట్టు తెలిసింది. బీబీపేట ఠాణా కేంద్రంగా ఈ ముగ్గురి మధ్య ఏర్పడిన స్నేహమే వీరి ప్రాణాల మీదకు తెచ్చిందా? ఏమిటనేది తేలాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం నుంచి ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి కనిపించకుండా పోయారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారు సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డి పెద్దచెరువు వద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది గాలించగా బుధవారం అర్ధరాత్రి శ్రుతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం సాయికుమార్ మృతదేహం లభించింది.
ముగ్గురూ కలిసే ఆత్మహత్య చేసుకున్నారా? లేక మొదట ఎవరైనా చెరువులో దూకితే వారిని కాపాడే క్రమంలో మిగతా వారు మునిగి చనిపోయారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరువురి మధ్య ఏర్పడిన చిన్నపాటి ఘర్షణ వల్ల దాడి జరిగిందా? అన్నది స్పష్టత రావడం లేదు. సంచలనంగా మారిన ఈ కేసులో పోలీసులు ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు.
భిక్కనూర్ ఎస్సై, బీబీపేట మహిళా కానిస్టేబుల్ అదృశ్యంపై సమాచారం రావడంతో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారున్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. ఎస్సై వాహనం, ఆయన చెప్పులు పడి ఉండటంతో చెరువులో గాలించగా మొదటగా శృతి, నిఖిల్ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్సై సాయికుమార్ డెడ్‌బాడీ దొరికింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే నిజానిజాలు బయటపడే అవకాశాలున్నాయి.