హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): వివిధ స్థాయి రాజకీయ నేతలతోపాటు పారిశ్రామికవేత్తలు, కుటీర పరిశ్రమల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బిల్డర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు క్యూకడుతున్నారు. హైదరాబాద్‌సహా దాదాపు అన్ని జిల్లాల్లో ఈ సందడి నెలకొన్నది. బీఆర్ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకే వారంతా జైకొడుతున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్లో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతోపాటు కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం అకాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీనర్సింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిల్డర్, పారిశ్రామికవేత్త ముత్యాల నర్సింహారెడ్డి, మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బిల్డర్లు రంగా రవి, ప్రసాద్, అనిల్ కట్టూరి, వెంకటరత్నం, ప్రసాద్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, పొన్నాల రమేశ్‌రెడ్డి, తకూరి జగదీశ్వర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, ప్రాణుథాన్రెడ్డి, సత్యనారాయణ, సంగమేశ్వర్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో లోయపల్లి చిన్న నర్సింగరావు, లక్ష్మీరావులపల్లి ఉపసర్పంచ్, ఫోరం అధ్యక్షుడు బెంజరం నవీన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత రంగారాయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత దండెం రాంరెడ్డి గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ బలోపేతానికి తీవ్రంగా శ్రమించిన రాంరెడ్డి.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలిచారు. ఆపద సమయంలోనూ ఆదుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా పోటీపడ్డారు. ఒకానొక దశలో ఆయనకే టికెట్ వస్తుందని అందరు భావించినా.. చివరి నిమిషంలో టికెట్ దక్కలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఓటమే ధ్యేయంగా పనిచేస్తానని దండెం రాంరెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో తన సత్తా ఏమిటో చూపిస్తానని అన్నారు.