Telangana | పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పందెం కోళ్ల వేలం పాట ఆసక్తికరంగా జరిగింది. ఇటీవల కోడిపందేలు ఆడుతున్న ముగ్గుర్ని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి రెండు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆ రెండు కోళ్ల అమ్మకానికి ఇవాళ వేలం పాట నిర్వహించారు. ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ వేలం పాటలో 20 మంది పాల్గొనగా.. దీన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలిరావడంతో అక్కడ హడావుడి నెలకొంది. ఈ రెండు కోళ్లకు వేర్వేరుగా వేలం పాట నిర్వహించగా రెండు పందెం కోళ్లకు రూ, 6,500 లు ధర పలికింది.
ఇందులో 2 కిలోల 980 గ్రాముల బరువు గల పందెం కోడికి రూ, 1341 లుగా, 2 కిలోల 410 గ్రాములు గల పందెం కోడికి రూ, 1085 లు మార్కెట్ ధరగా పోలీస్ శాఖ నిర్దారించింది. ఈ మేరకు ఈ పందెం కోళ్లకు నిర్దారించిన ధర ఎవరు ఎక్కువ పాట పాడితే వారే ఈ పందెం కోళ్లు కైవసం చేసుకుంటారని ఎస్సై చంద్రశేఖర్ వెల్లడించారు. అనంతరం రెండు పందెం కోళ్లలో వేర్వేరుగా వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో పాల్గొన్న పలువురు పోటాపోటీగా వేలం పాట పాడారు. వీరిలో 2 కిలోల 980 గ్రాముల బరువు గల పందెం కోడిని రూ.4వేలకు పురాణం సారయ్య దక్కించుకున్నారు. అలాగే 2 కిలోల 410 గ్రాముల బరువు గల మరో పందెం కోడిని రూ, 2500 లకు కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన బోనాల సత్యనారాయణ దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో వచ్చిన డబ్బులను మంథని కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.