మహబూబ్‌నగర్ అర్బన్, సెప్టెంబర్ 12 : పీఆర్ఎల్ఐ మోటర్లను ఆన్‌చేయగానే సమైక్య పాలనలో ఉమ్మడి జిల్లాకు పట్టిన దారిద్య్రం పోతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో 346 మంది లబ్ధిదారులకు మంగళవారం రూ.3.5 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతులమీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల మోటర్లను ఆన్ చేయనున్నట్టు తెలిపారు.
ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. మన్యంకొండ వద్ద తెలంగాణలోనే మొట్టమొదటి రోప్‌వే నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం శిల్పారామం ఉన్న స్థలంలో చెత్తకుప్పలు ఉండేవని, నేడు ట్యాంక్‌బండ్, సస్పెన్షన్ బ్రిడ్జి, నెక్లెస్ రోడ్డుతో కొత్తరూపు వచ్చిందని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్‌కు చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.