హనుమకొండ/సుబేదారి, సెప్టెంబర్ 20 : హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి తాళం పడింది. ఏడాది క్రితం సీఎం రేవంత్ ఆర్భాటంగా ప్రారంభించారు. ‘కుడా’ ఆధీనంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి ఏడాదైనా కాంట్రా క్టు పనులు చేపట్టిన మెస్సర్స్ బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీకాంత్‌రెడ్డికి రూ.4 కోట్లకు పైగా బిల్లులు రాకపోవడంతో శనివారం ప్రధాన గేట్లకు తాళం వేశారు. ఆదివారం నుంచి కళాక్షేత్రంలో మొట్టమొదటిసారి జరగనున్న కాకతీయ నృత్య నాటకోత్సవాల ఏర్పాట్ల కోసం అధికారులు చేరుకోగా గేట్లకు తాళాలను గమనించి కంగుతిన్నారు. ఈ విషయాన్ని వారు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కుడా ఉన్నతాధికారి అజిత్‌రెడ్డి కాంట్రాక్టర్‌తో మాట్లాడగా తాళం వేసింది తానేనని.. తనకు రూ. 4కోట్ల బిల్లు రావాల్సి ఉన్నదని తెలిపారు.
బిల్లులు చెలించే వరకు తాళం తీసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. విషయాన్ని అజిత్‌రెడ్డి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు సుబేదారి పోలీసులు కాంట్రాక్టర్‌తో మాట్లాడి నృత్య నాటకోత్సవాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు హాజరు కానున్నారని, వేసిన తాళం తీయాలని, బిల్లుల విషయాన్ని అధికారులతో మాట్లాడుకోవాలని హుకుం జారీ చేశా రు. ఈ క్రమంలో పోలీసులకు, కాంట్రాక్టర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పెండింగ్ బిల్లుల విషయాన్ని అధికారులతో మాట్లాడుకోవాలి తప్ప ఇలా చేయడం సరికాదని హెచ్చరించి తాళాలు తీశారు. బిల్లుల సంగతి తేల్చకుండా అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంట్రాక్టర్ వాపోయారు. కుడా వైస్ చైర్మన్ చాహత్ బాజ్‌పాయ్ ఫిర్యాదు మేరకు మెస్సర్స్ బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ రంజిత్ తెలిపారు.