Nalimela Bhaskar | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్, కాళోజీ నారాయణరావు సాహితీ పురసారానికి ఎంపికయ్యారు. శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించే ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సాహితీ పురసారాన్ని అందజేయనున్నది. పురస్కారం కింద రూ.1,01,116 నగదుతోపాటు జ్ఞాపికను అందజేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన నలిమెల భాసర్ తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి 2011లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన రచనల్లో అద్దంలో గాంధారి, మట్టి ముత్యాలు, సుద్దముక వంటి సంకలనాలు ప్రసిద్ధమైనవి. నలిమెలకు..14 భాషల్లో నైపుణ్యం ఉన్నది.
ధిక్కార దివిటీ కాళోజీ: కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి(సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు. తెలంగాణ ఉద్యమంలో కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను బయలుదేరిన నాడు నిండు మనసుతో కాళోజీ దీవించారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ స్ఫూర్తి కొనసాగే దిశగా ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. కాళోజీ పురసారాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ భాష, సాహిత్యాలలో విశేషంగా కృషి చేసిన సాహితీవేత్తలను గౌరవించుకుంటున్నాం అని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టామని, వరంగల్లో కాళోజీ కళాకేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.