హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): కూకట్పల్లి కల్తీ ఘటనతో రాష్ట్రసర్కారు సంచలన నిర్ణయానికి తెరలేపింది. హైదరాబాద్‌తో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న అన్ని కల్లు గీత సంఘాలు, టీఎఫ్టీలను రద్దు చేసి వాటి పరిధిలో కొనసాగుతున్న కల్లు దుకాణాలను ఎత్తేసేందుకు బుధవారం ఆబ్కారీ, పోలీస్ ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రభుత్వ పెద్దల సమావేశంలో చర్చించినట్టు సమాచారం. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని మలాజిగిరి, మేడ్చల్, శంషాబాద్, షాద్‌నగర్, సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెట్ల పరిధిలో కల్లు దుకాణాల వివరాలతో నివేదికను అందజేయాలని ఆబ్కారీ శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఔటర్ లోపల 454 కల్లు దుకాణాలు మూత పడనున్నాయి.
ఔటర్ పరిధిలో 390 తాటి కో-ఆపరేటివ్ సొసైటీలు ఉండగా హైదరాబాద్ ఈఎస్ పరిధిలో14 సొసైటీలు, 53 కల్లు దుకాణాలు ఉన్నాయి. సికింద్రాబాద్‌లో 31 సొసైటీలు ఉండగా, 50 కల్లు దుకాణాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మలాజిగిరిలో ఈఎస్ పరిధిలో 77 సొసైటీలు ఉండగా 79 కల్లు దుకాణాలు, మేడ్చల్ ఈఎస్ పరిధిలో 50 సొసైటీలు ,52 కల్లు దుకాణాలు, సరూర్‌నగర్ ఈఎస్ పరిధిలో 158 సొసైటీలు,158 కల్లు దుకాణాలు, శంషాబాద్ పరిధిలో 60 సొసైటీలు, 62కల్లు దుకాణాలు ఉన్నాయి.
ఇవేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని సరూర్‌నగర్ డివిజన్లో ఉన్న 188 టీ ఫర్ ట్రేడ్(టీఎఫ్టీ), షాద్‌నగర్‌లోని 146టీఎఫ్టీలు, మల్కాజిగిరిలోని 15టీఎఫ్టీలు, మేడ్చల్‌లోని 44టీఎఫ్‌టీల చొప్పున మొత్తం 393టీఎఫ్టీలు సైతం రద్దు కానున్నాయి.