Suryapet | సూర్యాపేట, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టును పనికిరానిదిగా చూపాలనే పంతానికి పోయి కాంగ్రెస్ సర్కారు రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టింది. రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసుకొని అన్నదాతల నోట్లో మట్టికొడుతున్నది. ప్రభుత్వ నిర్వాకంతో సూర్యాపేట జిల్లాలో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల కాళేశ్వరం ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాకు ఓవైపు కృష్ణా, మరోవైపు గోదావరి జలాలు అందుతాయి. నాగార్జునసాగర్ ఇప్పటికే నిండడంతో దాని ఆయకట్టుకు ఢోకా లేకపోయినా కాళేశ్వరం ఆయకట్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేసీఆర్ సర్కారు మాదిరి ప్రణాళికాబద్ధంగా మేడిగడ్డ పంపులను ముందే ఆన్‌చేసి ఉంటే ఇప్పటికే జలాలు జిల్లాకు చేరుకునేవి. బీఆర్ఎస్ పోరాటాల ఫలితంగా ఇటీవల మోటర్లను ఆన్ చేసినా ఆ నీళ్లు జిల్లాకు ఎప్పుడు చేరుతాయో అధికారులకే తెలియటం లేదు. అదును దాటుతున్నా నీటి విడుదల షెడ్యూల్ లేక ఆందోళన నెలకొన్నది.
ఐదేండ్ల పాటు ఏటా 30 టీఎంసీలు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సూర్యాపేట జిల్లాకు 2019 నుంచి 2023 వరకు ఐదేండ్ల పాటు ఏడాదికి రెండు సీజన్లకు గాను 24 నుంచి 30 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం నుంచి అందాయి. ప్రతి సీజన్‌కూ కాల్వల్లో 1,200 నుంచి 1,700 క్యూసెక్కుల చొప్పున అవసరాన్ని బట్టి సీజన్‌కు 65 రోజుల నుంచి 100 రోజుల పాటు నిరంతరాయంగా విడుదల చేశారు. బయ్యన్నవాగు నుంచి కాల్వల ద్వారా నేరుగా పంట పొలాలకు సీజన్‌కు 12 క్యూసెక్కులతో పాటు జిల్లాలో గోదావరి ఆయకట్టు పరిధిలోని దాదాపు 1,200 చెరువులు, కుంటలు నింపేందుకు మరో 2 టీఎంసీలు కలిపి సీజన్‌కు 12 నుంచి 15 టీఎంసీల చొప్పున విడుదల చేశారు. దీంతో ఏడాదంతా ఆయకట్టు చెరువులు జలకళతో ఉండేవి. ఐదేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం జూలై రెండు నుంచి ఆగస్టు మొదటి వారంలోనే నీటిని అందించింది.
వానకాలాన్ని కూడా ముంచుతుందా?
కాళేశ్వరంతో కేసీఆర్‌కు వచ్చిన గుర్తింపును తొలగించే కుట్రలకు దిగి కాంగ్రెస్ సర్కారు సూర్యాపేట జిల్లా రైతుల నోట్లో మట్టికొట్టింది. గోదావరి ఉగ్రరూపం దాల్చి వదర పోటెత్తినా మేడిగడ్డ బరాజ్ తట్టుకొని నిలబడటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి పంపులు ఆన్ చేసింది. మేడిగడ్డ వద్ద పంపులను నెల ముందు ఆన్‌చేసి ఉంటే ఇప్పటికే సూర్యాపేటకు నీళ్లు చేరేవని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా నీటి షెడ్యూల్ ప్రకటించాలని కోరుతున్నారు.
నీళ్లకోసం ఎదురుచూస్తున్నం
ఈ వానకాలానికి సంబంధించి సాగు పనులు మొదలైనయ్. నీటి వసతి ఉన్న రైతులు పొలాలు దున్నుతుంటే గోదావరి జలాలపై ఆధారపడి పంటలు వేసే నాలాంటోల్లు కాళేళ్వరం నీళ్లకోసం చూస్తున్నం. నీటి విడుదల షెడ్యూల్ త్వరగా ప్రకటిస్తే పంటలు సాగు చేసుకుంటం. షెడ్యూల్ రానిదే రైతులు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉన్నది.
-మిర్యాల వెంకన్న, రైతు, పర్సాయపల్లి, అర్వపల్లి