మోర్తాడ్, ఆగస్టు 7: ఎక్కడ సూర్యాపేట.. ఎక్కడ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్. సాగునీటి కోసం రైతులు ఇక్కడి దాకా వచ్చారంటే వానకాలం పంటల విషయంలో రైతులు ఎంత దీనస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం గ్రామానికి చెందిన పదిమంది రైతులు వారి గ్రామానికి సాగునీరు రావడం లేదని రెండు వాహనాల్లో మంగళవారం బయలుదేరారు. కాళేశ్వరం, అన్నారం బరాజ్, మేడిగడ్డ పంప్‌హౌస్ వద్దకు వెళ్లారు. నీటిని ఎందుకు వదలట్లేదని అక్కడి వారిని ప్రశ్నిస్తే ‘ఇసుక టెండర్ వేసిండ్రు. ఇసుక తీసినంక వాటర్ పంపిస్తమని’ బదులిచ్చారు. దీంతో బుధవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్దకు వచ్చారు.
అప్పటికే కాకతీయ కాలువకు నీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి.. వారిని గమనించి పలుకరించారు. ఇక్కడి వరకు ఎందుకు వచ్చారని ఆరా తీయగా.. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ నుంచి తుంగతుర్తికి నీళ్లు ఇస్తలేరని, దీంతో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తి వరకు తీసుకొచ్చి తమ పంటలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు ఇస్తే ఎక్కడ కేసీఆర్‌కు పేరువస్తుందోనని ఆలోచించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్లు ప్రా రంభించి అన్నారానికి, అక్కడి నుంచి సుందిళ్లకు నీళ్లు తరలించాలని సూచించారు. మధ్య లో ఎక్కడా నిల్వ ఉంచకుండా ఎంఎండీ, ఎల్ఎండీ నుంచి కాకతీయ ఫేజ్-2 ద్వారా తుంగతుర్తి వరకు నీళ్లు తరలించవచ్చన్నారు. ఎస్సారెస్పీ నుంచి తుం గతుర్తి వరకు నీళ్లు ప్రస్తుతం రావడం కష్టమని వేముల చెప్పడంతో రైతులు నిరాశకు లోనయ్యారు.
పంటలు ఎండిపోతున్నయి
నాలుగెరాల్లో వరి ఏసిన. రెండెకరాలు పండుతుంది. రెండకరాలు ఎండుతున్నది. బోర్లతోనే పంటలను ఏసినం. కాని ఆ నీళ్లు సరిపోతలేదు. బోనస్ ఇస్తనంటే నాలుగెకరాల్ల వరి ఏసిన. అదికూడ సరిగా పండుత లేదు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్లు మాదాంక అచ్చినయి. ఇప్పుడెందుకు అస్తలేవని మా ఊరునుంచి పది మంది రైతులం బయలుదేరినం. కాళేశ్వరం నుంచి పోచంపాడ్ దాంక చూస్కుంట అచ్చినం.
– నెహ్రూ, బండరామారం
నీళ్లియ్యాలి
చెర్లల్ల నీళ్లు లేవు. కాలువల్ల నీళ్లస్తలేవు. పంటలెట్ల పండించాలె. బోర్లనే నమ్ముకుంటే పంటలు పండెటట్ల లేదు. మునుపు పంటలకు నీళ్లు ఎట్లిచ్చిండ్రో ఇప్పుడుగూడ గట్లనే నీళ్లియ్యాలె. పోచంపాడ్ నుంచైనా మాదాంక నీళ్లిస్తరేమోనని అడిగితే ఇక్కడ్నుంచి కూడా నీళ్లు రావంటుండ్రు. అందుకే ఇంతకుముందు ఎైట్లెతే నీళ్లిచ్చిండ్రో ఇప్పుడగూడ గట్లనే నీళ్లియ్యమని కోరుతున్న.
– సూర, రైతు, బండరామారం