CM KCR | సిరిసిల్ల రూరల్, మార్చి 6: నిలువెల్లా విద్వేష భావజాలాన్ని అలవర్చుకున్న బీజేపీ నాయకులు మంచిని చూసి ఓర్వలేక పోతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన సంఘటనే. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్, బాలమల్లుపల్లె, నర్సింహుపల్లె గ్రామాల చెరువులకు రంగనాయకసాగర్ కాలువ ద్వారా కాళేశ్వర జలాలు చేరాయి.
తమ పొలాలకు నీళ్లు అందేలా చూడాలని ఆయా గ్రామాల రైతులతోపాటు చిన్నలింగాపూర్ ఎంపీటీసీ, బీజేపీ నేత బైరినేని రాము కూడా మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు రంగనాయకసాగర్ కాలువ ద్వారా ఆయా గ్రామాలకు నీటిని విడుదల చేశారు. దీంతో బీజేపీ ఎంపీటీసీ బైరినేని రాము రైతులతో కలిసి కాళేశ్వర జలాలకు పూజలు నిర్వహించి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞత ప్రకటించారు. దీనిని బీజేపీ జిల్లా నేతలు జీర్ఙంచుకోలేకపోయారు. ఎంపీటీసీ బైరినేని రాము పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నాడని పేర్కొంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆగమేఘాల మీద ప్రకటించారు.