ధర్మారం/రామడుగు/బోయినపల్లి, జూలై 29 : కాళేశ్వర గంగ ఉప్పొంగుతున్నది. లింక్-2లో ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు జలాశయానికి పరుగులు తీస్తున్నది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్‌హౌస్‌లో ఆదివారం వరకు నాలుగు మోటర్ల ద్వారా ఎత్తిపోతలు కొనసాగించిన అధికారులు, సోమవారం మరో మోటర్‌ను ఆన్‌చేశారు. ప్రస్తుతం 2,3,5,6,7వ పంపులు నడుస్తున్నాయి. ఒక్కో మోటర్ ద్వారా 3,150 చొప్పున 15,750 క్యూసెక్కులు డెలివరి సిస్టర్న్‌ల ద్వారా ఎగిసి పడి నంది రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. అండర్ టన్నెళ్లలో గ్రావిటీ ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిపోతున్నాయి. అధికా రులు సోమవారం ఐదో మోటర్‌ను ప్రారంభించారు. మొత్తంగా 15,750 క్యూసెక్కులు లిఫ్ట్ చేస్తుండగా, డెలివరి సిస్టర్న్‌ల ద్వారా ఎగిసిపడ్డ జలాలు సుమారు 5.7 కిలోమీటర్లు ఉన్న గ్రావిటీ కాలువ ద్వారా వరదకాలువకు చేరుకొని అక్కడి నుంచి మధ్యమానేరుకు పరుగెడుతున్నాయి.