హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): శాసనసభ మంగళవారం సాంకేతికంగా ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా పడనున్నది. ఆ తర్వాత శాసనసభ నుంచే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బరాజ్ (కాళేశ్వరం ప్రాజెక్టు) సందర్శనకు బయలుదేరుతారు. ఈ పర్యటనకు కోసమే మండలికి మంగళవారం విరామం ప్రకటించారు.
శాసనసభ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డకు వెళ్లారన్న సాంకేతికత కోసమే సభ లాంఛనంగా సమావేశమై ఆ వెంటనే వాయిదా పడనున్నది. అసెంబ్లీ లాబీల్లో ఈ విషయాన్ని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. శాసనసభ నిర్ణయం మేరకు సభ్యులు మేడిగడ్డ సందర్శన రికార్డుల్లో నమోదు కావడం కోసమే మంగళవారం సభ జరుగనుందని అధికారవర్గాల సమాచారం. ఎమ్మెల్యే మేడిగడ్డ పర్యటనపై మీడియాకు ప్రభుత్వం అధికారికంగా పంపించిన ఆహ్వానంలో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నది.
ఇటు నల్లగొండలో బీఆర్ఎస్ సభ.. అటు మేడిగడ్డలో మీడియా సమావేశం?
నల్లగొండ మంగళవారం బీఆర్ఎస్ సభ జరిగే సమయంలోనే మేడిగడ్డలో మీడియా సమావేశం నిర్వహించేలా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. శాసనసభ నుంచి సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉదయం 10-15 గంటలకు మేడిగడ్డకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డకు చేరుకొని ప్రాజెక్టును సందర్శిస్తారు. అక్కడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది.
అది ముగిశాక 3 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు. అక్కడ మీడియా ప్రతినిధులతో సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతారని అధికారవర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా పరీవాహక ప్రాంత ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగింతకు వ్యతిరేకంగా నల్లగొండలో నిర్వహించే బహిరంగ సభ ప్రారంభమయ్యే సమయంలోనే మేడిగడ్డలో ప్రభుత్వం మీడియా సమావేశం నిర్వహించేలా కార్యక్రమాన్ని ఖరారు చేసినట్టు తెలిసింది. వాస్తవానికి మేడిగడ్డకు తీసుకెళ్లే మీడియా బృందం ఉదయం 6ః30 గంటలకే హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది.
శాసనసభ నుంచి బయలుదేరిన ప్రజాప్రతినిధుల బృందం చేరుకునే దాకా వారు మేడిగడ్డ వద్దనే వేచి ఉండాలి. శాసనసభ్యుల బృందం సభ నుంచి ఆలస్యంగా బయలుదేరడానికి, సాయంత్రం 3 గంటల వరకు కాలయాపన చేయడానికి నల్లగొండలో బీఆర్ఎస్ సభ ప్రారంభం కోసమేనని తెలిసింది. నల్లగొండ సభ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మేడిగడ్డ వద్ద అదే సమయంలో సీఎం, మంత్రుల బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
14, 15 రెండు రోజులపాటు సభ
శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సభలో సోమవారం చర్చ జరగాల్సి ఉన్నది. అయితే సభలో నీటిపారుదల ప్రాజెక్టులపై ప్ర భుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. దీని పై ఉదయం నుంచి సాయంత్రం దాకా సభలో చర్చ జరగడంతో బడ్జెట్‌పై చర్చ కోసం ఈ నెల 14, 15 రెండు రోజులపాటు సభ జరిగే అవకాశం ఉంటుందని అధికారవర్గాల సమాచారం. ఈ నెల 14న మేడిగడ్డ సందర్శనపై సభలో చర్చ, 15వ బడ్జెట్‌పై చర్చ, ద్రవ్య వినీమయ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉన్నట్టు తెలిసింది.