Godavari Water | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ ) : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘కాళేశ్వరంతో కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లందింది లేదు.. ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది’ అంటూ నానా రచ్చ చేసి.. భారీ వరదకు ఒక్క పిల్లర్ కుంగితే దాన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకొని.. అధికారంలోకి రాగానే మొత్తంగా ప్రాజెక్టునే పక్కకు పెట్టాలని చూసిన రేవంత్‌రెడ్డికి, ఇప్పుడు అదే కాళేశ్వరం దిక్కయింది. హైదరాబాద్ మహా నగరానికి మంచినీటిని అందించేందుకుగాను గోదావరి జలాల తరలింపులో కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించిన పథకాన్ని అమలు చేయడం ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌కు అనివార్యంగా మారింది. కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లోనే హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు మూసీ ప్రక్షాళనకు 30 టీఎంసీల గోదావరి జలాల కేటాయింపును జోడించారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే హైదరాబాద్ నగరానికి కాళేశ్వర జలాలను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
కాకపోతే కేసీఆర్ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో కొండపోచమ్మసాగర్ నుంచి జలాల తరలింపునకు పథకాన్ని రూపకల్పన చేస్తే.. రేవంత్ ప్రభుత్వం పొంతనలేని సాంకేతిక హేతుబద్ధతతో పైప్లైన్ల పొడవు పెంచుకునేందుకు మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించేలా పథకాన్ని ప్రతిపాదించి ఖజానాపై వేల కోట్ల భారాన్ని మోపేందుకు సిద్ధమైంది. నాడు మల్లన్నసాగర్‌ను వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు అదో జలభాండాగారం అనే ప్రాతిపదికన హైదరాబాద్ మంచినీటి పథకాన్ని చేపడుతున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి రూ.1,060 కోట్లతో పది టీఎంసీల గోదావరి జలాలను నగరానికి తరలించేందుకు అవకాశమున్నది. కాంగ్రెస్ సర్కారు మల్లన్నసాగర్‌ను తెరపైకి తెచ్చి తొలుత 15 టీఎంసీల తరలింపునకు రూ.5,560 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించింది. తాజాగా 20 టీఎంసీల తరలింపు అంటూ అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.7,300 కోట్లకు పెంచినట్టు తెలిసింది. కేవలం కాగితాల్లోనే అంచనా వ్యయాన్ని వేల కోట్లు పెంచుకుంటూ పోతూ ఖజానాపై ప్రభుత్వం భారీభారం మోపుతున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యం గా పైపులైన్ల పొడవు పెంచేందుకే జలాల తరలింపు పరిమాణాన్ని పెంచి కొండపోచమ్మ నుంచి మల్లన్నసాగర్‌కు డిజైన్ మార్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జలమండలి అధికారుల మొర
జలమండలి ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఏడాది నుంచి సంస్థకు బడ్జెట్లో కేటాయించిన నిధులు మంజూరు కావడం లేదని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు మొర పెట్టుకున్నారు. జలమండలి ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలు, తాగునీటి సరఫరా నిర్వహణ ఖర్చులకే సరిపోతున్నదని వివరించారు. ఆదాయ, వ్యయాలు ఆశాజనకంగా లేవని, వీటిని అధిగమించేందుకు ఆర్థిక శాఖ సమన్వయంతో తక్షణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సీఎం సూచించారు. జలమండలి సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని చెప్పారు. ఇప్పటికే 20 వేల లీటర్ల నీటిని సిటీలో ఉచితంగా సరఫరా చేస్తున్నందున, ఇతర కనెక్షన్ల నుంచి రావాల్సిన నల్లా బిల్లు బకాయిలు క్రమం తప్పకుండా వసూలయ్యేలా చూడాలని చెప్పారు. జలమండలి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకోవాలని, తకువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని సూచించారు. అందుకు డీపీఆర్‌లు తయారు చేయించాలని చెప్పారు.
జల్ జీవన్ మిషన్ వైపు అడుగులు వేద్దాం
ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఉన్న జనాభాకు సరిపడే తాగునీటిని సరఫరా చేస్తున్నామని, మొత్తం 9,800 కిలోమీటర్ల డ్రింకింగ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా 13.79 లక్షల కనెక్షన్లకు నీటిని సరఫరా చేస్తున్నట్టు సీఎంకు అధికారులు నివేదించారు. 1965 నుంచి సిటీలో పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న మంజీరా పైపులైన్లకు కాలం చెల్లిందని, రిపేర్లు వస్తే దాదాపు 15 రోజులు నీటి సరఫరా నిలిచిపోతున్నదని వివరించగా పాత లైను వెంట అధునాతన లైన్ నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు తెచ్చుకునేందుకు వీలుగా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని సూచించారు. సమావేశానికి బోర్డు చైర్మన్ హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షత వహించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.
20 టీఎంసీలు తరలించేలా మార్పులు
రాబోయే 25 ఏండ్ల అవసరాలను అంచనా వేసుకొని గ్రేటర్ హైదరాబాద్‌లో మంచినీటి సరఫరాకు సరిపడా మౌలిక సదుపాయాలకు ప్రణాళికను తయారు చేయాలని జలమండలి అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2050 నాటికి పెరిగే జనాభా అవసరాలకు సరిపడేలా ప్లాన్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ తాగునీటితో పాటు సీవరేజీ ప్లాన్‌ను రూపొందించాలని, అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన జలమండలి బోర్డు సమావేశంలో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నిర్దేశించిన గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టును మల్లన్నసాగర్ నుంచి చేపట్టాలా? కొండపోచమ్మ సాగర్‌ను ఎంచుకోవాలా? అనే అంశంపై చర్చించారు.