హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కన్నీళ్లు తుడిచేందుకు, రాష్ట్ర సాధన ఉద్యమ ఆంక్షాలు, లక్ష్యాలను నెరవేర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్టు రాష్ట్ర జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ చెప్పారు. 16 లక్షల ఎకరాలకు బదులుగా 37 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేసినట్టు తెలిపారు. విద్యుత్తుశాఖకు చెందిన రఘు, కేంద్ర జల్‌శక్తిశాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ సీడబ్ల్యూసీ లేఖలను వక్రీకరించారని ఆక్షేపించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట మంగళవారం ఆయన హాజరై తన అఫిడవిట్ దాఖలు చేశారు. అనంతరం వీ ప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను కమిషన్ ఎదుట అఫిడవిట్ దాఖలు చేశానని చెప్పారు. తుమ్మడిహట్టి నిర్మాణం సాధ్యం కాదని, ఇందుకు సంబంధించిన కారణాలతో కూడిన వివరాలను ఇచ్చినట్టు తెలిపారు. గోదావరి వాటర్ స్టోరేజీగా ఉండాలని, తుమ్మడిహట్టి వద్ద నిర్మించాల్సిన బరాజ్‌ను మేడిగడ్డకు మార్చామని స్పష్టంచేశారు. 190 కిలోమీటర్లు గోదావరి సజీవంగా ఉండాలనే ఉద్దేశంతో డిజైన్ చేసినట్టు చెప్పారు. అలాగే తుమ్మడిహట్టిపై కాగ్ ఆక్షేపాలను కూడా కమిషన్‌కు వివరించినట్టు పేర్కొన్నారు. తాను సమర్పించిన అఫిడవిట్ పరిశీలన తర్వాత మళ్లీ పిలుస్తామని కమిషన్ చెప్పినట్టు వీ ప్రకాశ్ వెల్లడించారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ కొనసాగుతున్నది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో మంగళవారం నిర్వహించిన ఓపెన్‌కోర్టుకు ఐదుగురు ఇంజినీర్లు హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మేడిగడ్డ లోకేషన్ మారలేదని కమిషన్ ముందు ఇంజినీర్లు స్పష్టం చేశారు. మూడు బ్యారేజీలకు సంబంధించి డిజైన్లలో ఎలాంటి సమస్య లేదని నిబంధనల ప్రకారమే డిజైన్లు ఉన్నాయని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు కారణం రాఫ్ట్ కింద పలు సమస్యలేనని వివరించారు. సిఖెండ్ ఫైల్స్, అలాట్మెంట్ డివియేషన్ వల్ల సమస్య వచ్చిందని ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు.