జయశంకర్ భూపాలపల్లి/ హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఎస్ఐ కీచకుడిగా మారాడు. తన పోలీస్‌స్టేషన్‌లోనే విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఎస్సైగా పనిచేస్తున్న భవానీసేన్‌ను అదే స్టేషన్లో పనిచేస్తున్న ఒక మహిళా హెడ్‌కానిస్టేబుల్‌పై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లైంగికదాడిని సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం ఆయనను డిస్మిస్ చేసింది.
ఎస్సై హోదాను అడ్డుపెట్టుకుని పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ఠలను దిగజార్చేలా వ్యవహరించడంతో భవానీసేన్‌పై ఎలాంటి విచారణ లేకుండానే ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్టు మల్టీజోన్-1 ఐజీ ఏవీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళేశ్వరం పాత పోలీస్ స్టేషన్ బిల్డింగ్‌లో రెండో అంతస్తులో ఎస్సై నివసిస్తుండగా, గ్రౌండ్‌ఫ్లోర్‌లో మహిళా కానిస్టేబుల్ నివాసం ఉంటున్నారు.
ఒంటరిగా నివసిస్తున్న ఆమెను ఎస్సై పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేయగా తీవ్రంగా ప్రతిఘటించింది. ఎస్సై భార్య ఇంట్లో లేని పది రోజులు ఆమెను టార్చర్ పెట్టాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. మరో రోజు తాను బాత్రూంలో కింద పడ్డానని సదరు కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి పిలిచి రివాల్వర్‌తో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు.
విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించడంతో ఇంతకాలం వెలుగులోకి రాలేదు. కాగా ఎస్సై తరచూ వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిపోయిన బాధితురాలు చివరకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావును విచారణ అధికారిగా ఎస్పీ కిరణ్ ఖరే నియమించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఎస్సైని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
బాధితురాలితోపాటు స్టేషన్‌లోని మరి కొందరు సైతం ఎస్సై వేధింపులకు పాల్పడినట్టు విచారణ అధికారికి వివరించారు. కాళేశ్వరంలో మరో ఇద్దరిని, అన్నారంలో ఒక మహిళను సైతం ఎస్సై లైంగికంగా వేధించినట్టు ఫిర్యాదుచేశారు. దీంతో ఎస్సై భవానీసేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విచారణ జరిపారు.
ఈ సందర్భంగా ఎస్సై ఎవరికీ చెప్పకుండా కారెక్కి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని తీసుకొచ్చి విచారణ జరిపినట్టు తెలిసింది. కాగా ఎస్సైపై లైంగికదాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద 449, 376(2), 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి భూపాలపల్లి కోర్టులో హాజరుపరచగా, జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని పరకాల సబ్ జైలుకు తరలించారు.
ఆదినుంచీ ఇదే తీరు
ఎస్సై భవానీసేన్ తీరు ఆదినుంచీ వివాదాస్పదమే. పని చేసిన ప్రతి చోటా ఫిర్యాదులే. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా పనిచేసిన సమయంలో ఒక మహిళపై లైంగికదాడికి ప్రయత్నించగా ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. కాళేశ్వరంలో ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒక ఖద్దరు నేత అండదండలతో ప్రతి ఒక్కరినీ ఏదో రకంగా వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలున్నాయి.
అందరితోనూ దురుసుగా ప్రవర్తించేవాడు. తనకు పెద్దల అండ ఉన్నదంటూ సదరు ఖద్దరు చొక్కా పేరు చెప్పుకుని మరీ దందా నడిపించాడు. కాళేశ్వరానికి చెందిన ఒక వ్యక్తి ‘సింగం-3’ అనే పేరుతో ఇచ్చిన తన ఫొటోను సీటు పక్కనే సినిమా హీరో ైస్టెల్లో పెట్టుకునేవాడని చెప్పుకుంటున్నారు. ఆటో డ్రైవర్ దగ్గరి నుంచి కాంట్రాక్టర్ల వరకు నెలవారీ మామూళ్లు ముట్ట జెప్పుకోవాల్సిందే.
ఏసీబీ ట్రాప్‌కు ప్లాన్?
ప్రతి ఒక్కరి వద్ద అందిన కాడికి దోచుకునే ఎస్సై భవానీసేన్‌పై అందరూ విసిగిపోయారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతో వెనుకడుగు వేశారు. కాగా కాళేశ్వరానికి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి మాత్రం ఎస్సై వేధింపులు భరించలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు తెలిసింది.
కాగా రెండు రోజులుగా ఏసీబీ అధికారులు అతనిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు కాళేశ్వరంలోనే మకాం వేసినట్టు సమాచారం. సదరు ప్రజాప్రతినిధి సహకారంతో బుధవారం ఎస్సైని ట్రాప్ చేసేందుకు ఏసీబీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. అయితే, మంగళవారం అర్థరాత్రి ఎస్సై అరెస్టు కావడంతో ఏసీబీ ట్రాప్ నుంచి తప్పించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
శాంతిభద్రతలను కాపాడాలి: హరీశ్‌రావు
వరుసగా జరుగుతున్న హత్యలు, లైంగికదాడులు, హింసాయుత ఘటనలే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చోటుచేసుకోవడం విషాదకరమని పేర్కొన్నారు.
రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్‌ను భక్షించే దుర్ఘటన భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైనదని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కారకుడైన ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు.
గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉటూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్‌ను కర్రలతో కొట్టి చంపడం, హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో అందరూ చూస్తుండగా సమీర్‌ను దారుణంగా పొడిచి చంపడం లాంటి ఘటనలను ఉదహరించారు. గత పదేండ్లలో శాంతిభద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భద్రత ప్రశ్నార్థకం కావడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.