హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ తుది నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన సంగతి తెలిసిందే. మీడియా సమావేశంలో పీసీ ఘోష్ ఇదే విషయాన్ని చెప్పారు. ప్రభుత్వం ఆ నివేదికను లాకర్లో పెట్టిందని, సోమవారం జరుగబోయే క్యాబినెట్ సమావేశం సమయంలో తెరుస్తారని ప్రచారం జరిగింది. శనివారం వరకు కూడా నివేదిక రహస్యంగానే ఉన్నదని అంతా భావించారు.
కానీ.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రకటనతో అనుమానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్రలో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా జోగిపేట నియోజకవర్గ కేంద్రంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చింది. కేసీఆర్‌ను బోనులో నిలబెట్టింది. కేసీఆర్ దోషి అని తేల్చింది. రూ లక్ష కోట్లు వృథా చేసిందని కమిషన్ చెప్పింది. ఇంజనీర్లు చెప్పింది వినలేదు, నిపుణులు చెప్పింది వినలేదు. దీనికి శిక్ష పడకూడదా’ అని వ్యాఖ్యానించారు.
ఒకవేళ ఇదే నిజమైతే.. ‘ప్రభుత్వం ఆధీనంలో రహస్యంగా ఉండాల్సిన నివేదికలోని అంశాలు పార్టీ అధ్యక్షుడికి ఎలా తెలిశాయి? ప్రభుత్వ పెద్దలు ఆయనకు ప్రత్యేకంగా కాపీ పంపారా?’ వంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లేదా అందరూ కలిసి తమకు లబ్ధి చేకూరేలా నివేదికలో మార్పులు చేర్పులు (ట్యాంపరింగ్) చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీల్డ్ కవర్ నివేదిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతిలో ఉన్నప్పుడే ఆంధ్ర అనుకూల మీడియా కేసీఆర్ టార్గెట్‌గా కథనాలు రాసిందని గుర్తు చేస్తున్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా రహస్య నివేదికలోని అంశాలు తనకు తెలిసినట్టే మాట్లాడటంపై ప్రజల్లో ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.