Kaleshwaram | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మిషన్ మోడ్ పనివిధానం అద్భుతమని, ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానం చేయడం అపూర్వమని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంజినీర్ల బృందం ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత స్వల్పకాలంలో పూర్తిచేయడం గొప్ప విషయమని కొనియాడారు. తెలంగాణ నీటిపారుదల ప్రగతి దేశానికే ఆదర్శమని కితాబిచ్చారు. పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్‌మాన్ ఆదేశాల మేరకు మిషన్ కాకతీయ పథకం సాధించిన ఫలితాలను అధ్యయనం చేసేందుకు రీజినల్ రిసెర్చ్ స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ మన్మోహన్జిత్సింగ్, శాస్త్రవేత్తలు సంజయ్ సత్పుతే, అబ్రార్ యూసుఫ్‌తో కూడిన ఇంజినీర్ల బృందం తెలంగాణలో పర్యటిస్తున్నది.
కాళేశ్వరం పంప్‌హౌస్‌లు, కొండపోచమ్మసాగర్తోపాటు సిద్దిపేట జిల్లాలోని చెరువులు, చెక్‌డ్యామ్‌లు, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలోని నిజ్లాపూర్, కొమిరెడ్డిపల్లి, అడ్డాకల్ మండలంలోని గౌరిదేవిపల్లి, రాచర్ల, నుసురుల్లాబాద్ పెద్దచెరువులను సందర్శించింది. గురువారం సాయంత్రం జలసౌధలో రాష్ట్ర సాగునీటి పారుదల, భూగర్భజలశాఖ అధికారులతో భేటీ అయింది. మిషన్ కాకతీయ చెరువులు, చెక్‌డ్యాంలు, భూగర్భ జలాల రీచార్జింగ్ విధానాలను రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వారికి వివరించారు. అనంతరం మీడియాతో పంజాబ్ ఇంజినీర్ల బృందం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రశంసల వర్షం కురిపించింది.
కాళేశ్వరం ప్రాజెక్టును రాజస్థాన్‌కు చెందిన ఇంజినీరింగ్ అధికారుల బృందం సైతం గురువారం సందర్శించింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా టెక్నికల్ అంశాల అధ్యయనానికి రాజస్థాన్ జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ మీనా నేతృత్వంలో 14 మంది ఇంజినీర్ల బృందం తెలంగాణలో పర్యటిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే నిర్మించడం మహాద్భుతమని డాక్టర్ మన్మోహన్జిత్సింగ్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం నీటి పారుదల విధానంలో దేశానికి మాడల్‌గా నిలుస్తున్నదని, సీఎం కేసీఆర్ చాలా గొప్పగా పనిచేశారని ప్రశంసించారు. తెలంగాణ చేపట్టిన మిషన్ కాకతీయ ఫలితాలు అద్భుతమని, దానిని పంజాబ్‌లో అమలు చేసేలా తమ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రంగం దేశానికి మాడల్‌గా నిలిచిందని కొనియాడారు. తెలంగాణలోని మిషన్ కాకతీయ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని పంజాబ్‌లోని దాదాపు 20 వేల చెరువుల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని వెల్లడించారు. తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, పీఅండ్ఎం ఎస్ఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.