హైదరాబాద్, జూన్10 (నమస్తే తెలంగాణ): ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ విచారణలో వెల్లడించే ఏ అంశాన్నయినా అఫిడవిట్ ద్వారా తెలపాలని ఇరిగేషన్ ఇంజినీర్లకు న్యాయవిచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సూచించారు. ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం నియమించిన కమిషన్ చైర్మన్ ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తాజాగా బీఆర్కే భవన్లో విచారణను ప్రారంభించారు. తొలిరోజు సోమవారం రిటైర్డ్ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, మరో ఐదుగురు ఇంజినీర్లను చైర్మన్ ఘోష్ విచారించారు. మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన పలు అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లడించిన ప్రతి అంశాన్ని అఫిడవిట్‌గా దాఖలు చేయాలని సూచించారు.
మరికొంత సమయం పడుతుంది : జస్టిస్ ఘోష్
విచారణ అనంతరం జస్టిస్ ఘోష్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ప్రాజెక్టుపై విచారణను ప్రారంభించామని, అన్ని విషయాలు రాబోయే రోజుల్లో బయటకు వస్తాయని వెల్లడించారు. కమిషన్‌కు ఇప్పటివరకు మొత్తం 54 ఫిర్యాదులు వచ్చాయని, అందులో నష్టపరిహారం ఫిర్యాదులు కూడా ఉన్నాయని, వాటిని కూడా విచారిస్తామని వెల్లడించారు. ఎలక్షన్కోడ్ నేపథ్యంలో కొంత ఆలస్యమైందని, జూన్ 30లోగా విచారణ పూర్తి కాదని, ఇంకాస్త సమయం పడుతుందని చెప్పారు. అసలు విషయాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు.
ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఏజెన్సీలను కూడా పిలిచి విచారిస్తున్నామని, నిజాలు తెలుసుకునేందుకు అందరి వద్దా సమాచారం తీసుకుంటున్నామని వివరించారు. నేడు సైతం విచారణ రావాలని 18 మందికి నోటీసులిచ్చామని తెలిపారు. సాంకేతిక అంశాలపై విచారణ పూర్తయ్యాకనే, ఆర్థిక, ఇతర అంశాలపై దృష్టి పెడుతామని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి రిపోర్టులన్నీ అందాయని, వాటినీ పరిశీలిస్తున్నామని తెలిపారు.