హైదరాబాద్ మే 20 (నమస్తే తెలంగాణ)/కంఠేశ్వర్: కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర, రాజకీయ కక్షతోనే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో గోదావరి జలాల్లో తెలంగాణ వాటా దక్కకపోవడంతో మన రైతాంగం పడ్డ గోసను చూసి కేసీఆర్ ఎంతగానో బాధపడ్డారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దే సంకల్పంతో కేసీఆర్ కాళేశ్వరం బృహత్తర ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు మొదటినుంచీ కడుపుమంటతో ఈర్ష్య పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రైతులు, పేదలు బాగుపడటం ఆ పార్టీకి ఇష్టముండదని దుయ్యబట్టారు. ప్రజలు ఎప్పటికీ పేదరికంలో ఉంటేనే తమకు పదవులు వస్తాయనే భావనతో కాంగ్రెస్ నాయకులు ఉంటారని విమర్శించారు.
తెలంగాణలోని బీడు భూములకు గోదావరి జలాలతో తడిపే లక్ష్యంతో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు మెదటినుంచీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు పగుళ్లు రావడం, వెనువెంటనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీఎస్ఏ రంగంలోకి దిగడం, పడవలో చేరుకొని ఫొటోలు తీయడం, వీటిని అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేయడం జరిగిందని గుర్తుచేశారు. ఆ కుట్రల కొనసాగింపులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తన జీవితాన్ని పణంగా పెట్టిన కేసీఆర్‌పై కుట్రతోనే నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఆమరణ దీక్షకు దిగిన మహానేత గౌరవాన్ని తగ్గించేందుకే కుట్ర కోణంలోనే ఈ కమిషన్‌ను ఏర్పాటుచేసిందని ఆరోపించారు. రాజకీయ కక్షతో వేసిన ఇలాంటి కమిషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్నే గెలిపిస్తాయనే విశ్వాసం వ్యక్తంచేశారు. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని, పాలేవో, నీళ్లేవో ప్రజలకు స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.