హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్‌కుమార్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బరాజ్ గ్రౌటింగ్‌పై వివరణ ఇవ్వాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆ నోటీసుల్లో ఆదేశించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిషన్ విచారణ దాదాపు చివరి దశకు చేరుకున్నది. ఈ విచారణలో భాగంగా ఇటీవల రాజకీయ ప్రముఖులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన కమిషన్.. ప్రస్తుతం తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించే పనిలో నిమగ్నమైంది. ఆ క్రమంలో మేడిగడ్డ బరాజ్ గ్రౌటింగ్‌కు సంబంధించి ఈఎన్సీ అనిల్‌కుమార్ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారనే అభిప్రాయానికి కమిషన్ వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న మరోసారి తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని తాజాగా నోటీసులు జారీ చేసినట్టు కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. కాళేశ్వరంపై కమిషన్ అడిగిన సమాచారాన్ని ప్రభుత్వం సమర్పించింది. ఆ డాక్యుమెంట్లను అధ్యయనం చేస్తున్న కమిషన్.. ఈ నెల 27 తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం.