హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత వరమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరిగాయని, వేసవిలో సైతం చెరువులు మత్తళ్లు దుంకాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజలకు 100 శాతం ఉపయోగం ఉన్నదని తెలిపారు. ఆదివారం ఓ న్యూస్ చానెల్ ఇంటర్వ్యూలో ఈటల మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ఈ రోజు ఎస్సారెస్పీలో 14.8 లక్షల ఎకరాలకు బావుల్లో ఎలాంటి పూడికలు తీయకుండా చివరి ఆయకట్టుకు నీళ్లు అందించింది. మిడ్‌మానేరు నుంచి అవసరమైతే రివర్స్ పంపింగ్ ద్వారా నిజామాబాద్ నుంచి కరీంనగర్‌కు లిఫ్టు ఇరిగేషన్‌కు నీళ్లు ఇచ్చేందుకు కూడా గ్యారెంటీ ఏర్పడింది.
వాగులు పారినయ్. ప్రాణహిత-చేవెళ్ల, మేడిగడ్డ కింద వాగులు, వంకలు పొంగిపొర్లినయి. వందల చెక్‌డ్యాములు కట్టడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. మహబూబ్‌నగర్ ప్రాంతంలో కూడా ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దుంకినై. ఈ రోజు పంటలు ఎక్కువ పంటలు పండినయ్. నేను సాక్ష్యం. నేను 20 ఏండ్లు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా చేసిన.కాల్వల పొంటి తిరిగిన. చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని చెప్పినం. వరంగల్‌కు ఎన్నడూ ఇన్ని నీళ్లు రాలేవు. నల్లగొండకు ఎన్నడూ ఇన్ని నీళ్లు రాలేవు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అయ్యే కరెంట్ బిల్లును పక్కన పెడితే రాష్ర్టానికీ ప్రాజెక్టు అద్భుత వరం’ అని ఈటల స్పష్టంచేశారు.