Harish Rao | సిద్దిపేట, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘24 గంటల్లో కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేయకపోతే.. పెద్దఎత్తున రైతులను తీసుకుని మల్లన్నసాగర్‌ను ముట్టడిస్తాం. అవసరమైతే మేమే గేట్లు ఎత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేస్తాం. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కండ్లు తెరువాలి. మొద్దునిద్ర నుంచి బయటకు వచ్చి తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి, 10 వేల ఎకరాల్లో పంటలు కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం.’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చిరించిన రెండు గంటల్లోనే సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కూడవెల్లి వాగులోకి కాళేశ్వర జలాలు పరుగులు పెట్టాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు సిద్దిపేట కలెక్టర్‌కు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి జిల్లా రైతుల పక్షాన వినతి పత్రం అందించారు.
కూడవెల్లి వాగులోకి వెంటనే మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వెంటనే తేరుకున్న ప్రభుత్వం మధ్యాహ్నం 1 గంట తర్వాత మల్లన్నసాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి 800 క్యూసెక్కుల నీటిని నీటి పారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. దీంతో సుమారు 15 వేల ఎకరాలకు భరోసా లభించింది. ప్రస్తుతం మల్లన్నసాగర్లో 10 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఫిబ్రవరి మాసంలో తొలి విడతగా అప్పర్ మానేరు వరకు 0.5 టీఎంసీల నీటిని, కూడవెల్లి వాగుకు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. రెండో దశలో మంగళవారం మరోసారి నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు వివరించారు. మొత్తంగా హరీశ్‌రావు దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చిందని, బీఆర్ఎస్ పోరాటం వల్ల మాకు సాగునీరు వచ్చిందని..మా పంటలను పండించుకుంటాం అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం 11.15 గంటలు కూడవెల్లిలోకి 24 గంటల్లో నీళ్లు వదలకపోతే మల్లన్న సాగర్ గేట్లు మేమే ఎత్తుతం.
– హరీశ్ హెచ్చరిక
మధ్యాహ్నం1.10 గంటలు మల్లన్నసాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసిన ప్రభుత్వం