హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికను ఈ నెల 31లోగా అందజేయనున్నట్టు సమాచారం. నివేదిక సిద్ధమైందని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ ఘోష్ నివేదికపై తుది కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
భవిష్యత్‌లో న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా, ఆయా లీగల్ అంశాలను మరోసారి అధ్యయనం చేస్తున్నట్టు కమిషన్ వర్గాలు తెలిపాయి. కమిషన్ల విచారణపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తం ప్రక్రియను పూర్తి చేసి జూలై 31లోపు ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్న ది.
కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో భాగస్వాములైన అన్ని విభాగాలకు చెందిన ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీలు, రాజకీయ ప్రముఖులు, కాగ్ అధికారులు వెల్లడించిన అంశాలను, సమర్పించిన డాక్యుమెంట్లతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎన్డీఎస్ఏ రిపోర్టులను అధ్యయనం చేసిన కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసేందుకు సమాయత్తమవుతున్నది.