MLC Kodandaram | హైదరాబాద్, డిసెంబర్20 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంపై కాళేశ్వరం కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేయడమే కాకుండా, ఎవరైతే ఏంటి రూల్స్ ఫాలో కావాలంటూ చురకలంటించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట శుక్రవారం ప్రొఫెసర్ కోదండరాం, వెదిరె శ్రీరాం హాజరయ్యారు. ఇప్పటికే వారిద్దరూ ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లపై జస్టిస్ ఘోష్ విచారణ జరిపారు. తొలుత వెదిరె శ్రీరామ్‌ను విచారించారు.
శ్రీరామ్ అందజేసిన అఫిడవిట్లో పేరొన్న సీడబ్ల్యూసీ నుంచి తీసుకున్న సీఈ సీడీవో లెటర్‌కు, అధికారులిచ్చిన లేఖకు తేడా ఉండటాన్ని గమనించిన జస్టిస్ ఘోష్ ఇదేమిటని నిలదీశారు. అయితే, ఆ లేఖను నేరుగా సీడబ్ల్యూసీ నుంచే తీసుకున్నానని, తేడాలు ఎందుకున్నాయో తెలియదని వెదిరె శ్రీరామ్ బదులివ్వగా, సీడబ్ల్యూసీకి నోటీస్ ఇచ్చాకే ఆ లెటర్‌ను పొందారా? అని కమిషన్ ప్రశ్నించింది. తాను జలశక్తి సలహాదారుగా పనిచేస్తున్నానని, కాళేశ్వరానికి సంబంధించిన పలు మీటింగుల్లోనూ పాల్గొన్నానని, ఆ హోదాలోనే సీడబ్ల్యూసీ నుంచి లేఖ తీసుకున్నట్టు చెప్పడంతో జస్టిస్ ఘోష్ తీవ్ర ఆసంతృప్తి వ్యక్తంచేశారు. ఎవరైనా సరే, అది పబ్లిక్ డాక్యుమెంటైనా కూడా పద్ధతి ప్రకారం పొందాలని, ఆ రూల్స్‌ను ఫాలో కానప్పుడు ఆ డాక్యుమెంట్‌ను ఎలా పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. కోర్టులు ఇలాంటి డాక్యుమెంట్లపై ఆధారపడబోవని తేల్చిచెప్పారు.
అనంతరం కమిషన్ చేపట్టిన బహిరంగ విచారణకు కోదండరాం హాజరయ్యారు. ఆయన అందజేసిన అఫిడవిట్‌ను పరిశీలించిన జస్టిస్ ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు అది అఫిడవిట్టేనా? ఆధారాలేవీ లేకుండా అఫిడవిట్ ఎలా సమర్పిస్తారు? దాఖలు చేసే విధానం ఇదేనా? అని ప్రశ్నించారు. ఇందుకు నిర్ణీత నమూనాలో సోమవారం ఆధారాలు సమర్పిస్తానని కోదండరాం సమాధానమివ్వగా, ఇప్పటికే 90 రోజులు గడువిచ్చామని, కోర్టులు అంతకుమించి టైమ్ ఇవ్వబోవని జస్టిస్ ఘోష్ తేల్చిచెప్పారు. అఫిడవిట్‌పై సంతకం, అఫిడవిట్‌కు జత చేసిన కొన్ని పత్రాలపై అటెస్ట్ చేసిన సంతకం మీవేనా? అని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీని కూడా పెట్టినట్టున్నారు కదా? అని అడిగారు. అనంతరం 2016 నుంచి 2019 వరకు మైనర్ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన, ప్రస్తుత స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్‌ను జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మీ రోల్ ఏమిటి? బరాజ్‌లకు సంబంధించిన పాలసీ డెసిషన్ ఏమైనా తీసుకున్నారా? అని ప్రశ్నించారు. తాను మైనర్ ఇరిగేషన్, భూసేకరణ అంశాలను మాత్రమే చూశానని, బరాజ్‌లకు సంబంధించిన నిర్ణయం, నిర్మాణం వరకు జరిగిన అంశాల్లో తనకు ఎలాంటి సంబంధం లేదని వికాస్‌రాజ్ సమాధానమిచ్చారు.