హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు (Pranahita-Chevella Project) మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టే (Kaleshwaram) ప్రాణాధారం కానున్నది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన సుందిళ్ల బరాజ్.. ఇప్పుడు ప్రధాన వనరుగా మారనున్నది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నిర్దేశిత జలాల మళ్లింపు అసాధ్యమేగాక, ఆర్థికంగానూ భారం కానున్నది. ఎల్లంపల్ల నుంచి కాకుండా సుందిళ్ల నుంచి తక్కువ ఖర్చుతో తరలించవచ్చని ఉన్నతాధికారులు, ఇంజినీర్లు తేల్చారు. తాజాగా నిర్వహించిన సమీక్షలో సుదీర్ఘంగా చర్చించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం సుందిళ్ల ప్రతిపాదనకే మొగ్గుచూపినట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టే నిరర్థకమంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు అందులో భాగంగా నిర్మించిన సుందిళ్ల బరాజ్ ఆధారంగానే ప్రణాళికలకు చేపట్టడం చర్చనీయాంశమైంది. దీంతో బరాజ్‌లపై సర్కారు చేసిన ప్రచారమంతా వట్టిదేనని తేటతెల్లమవుతున్నది.
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి (PCSS) ప్రాజెక్టును 2007లో ప్రతిపాదించింది. వార్ధా, వెయిన్‌గంగా నదులు కలిసిన తరువాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తమ్మిడిహట్టి వద్ద బరాజ్‌ను నిర్మించాలని నిర్ణయించింది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు 116 కిలోమీటర్లు ఉంటుంది. 74 కిలోమీటర్ల పాయింట్ వద్ద ఒక పంప్‌హౌస్‌ను ఏర్పాటుచేయాలి. అక్కడినుంచి 2వ కిలోమీటర్ వరకు 3.60 డయా ఎంఎస్పీ పైపుల ద్వారా నీటిని 10 మీటర్ల డయా కలిగిన 9 కిలోమీటర్ల పొడవైన రెండు టన్నెళ్లలోకి తరలించాలి. మళ్లీ 92వ కిలోమీటర్ పాయింట్ వద్ద పంపింగ్ స్టేషన్-2ను ఏర్పాటుచేయాలి. అక్కడినుంచి నీళ్లను మళ్లీ 19 మీటర్లు ఎత్తిపోయాలి. 92వ కిలోమీటర్ నుంచి 101 కిలోమీటర్ వరకు గ్రావిటీ ద్వారా జలాలను తరలించాలి. 101 కిలోమీటర్ పాయింట్ వద్ద రాళ్లవాగుపై బరాజ్‌ను నిర్మించి నీళ్లను తరలించాలి. రాళ్ల వాగు నుంచి నీళ్లు ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు చేరుతాయి. ఇదీ తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటి సరఫరా తీరు. మొత్తంగా రెండు లిఫ్ట్‌ల ద్వారా దాదాపు 48 మీటర్ల మేరకు జలాలను ఎత్తిపోయాలి. కానీ బరాజ్ ఎఫ్‌ఆర్‌ఎల్‌ను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికీ నిర్ణయించకపోవడంతో బరాజ్ పనులే మొదలుకాలేదు.
కానీ, ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ సర్కారు మహారాష్ట్ర అనుమతి లేకుండా 152 ఎఫ్‌ఆర్‌ఎల్‌ను ఏకపక్షంగా నిర్ధారించడమేగాక, ఆ మేరకు కాలువల నిర్మాణాన్ని చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సుదీర్ఘ మంతనాలు జరిపినా, ఒప్పించేందుకు యత్నించినా 152 ఎఫ్ఆర్ఎల్కు మహారాష్ట్ర అంగీకరించలేదు. 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ నిర్మాణానికి మాత్రమే సుముఖత వ్యక్తంచేసింది. అయితే, ఆ ఎత్తుతో బరాజ్‌ను నిర్మిస్తే ప్రాజెక్టులో భాగంగా తరలించాల్సిన 160 టీఎంసీలను తరలించలేమని అనాడే ఇంజినీర్లు వెల్లడించారు. బరాజ్ ఎత్తు కుదింపు వల్ల ఆ మేరకు 2.55 మీటర్ల మేరకు వాటర్హెతోపాటు నీటి సరఫరా వేగం పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో జలాల డైవర్షన్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఆ హెడ్‌తో 150 రోజులపాటు నిరాటంకగా నీటిని మళ్లించుకున్నా గరిష్ఠంగా 66 టీఎంసీలు, కనిష్ఠంగా 44 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని దుస్థితి. పీసీఎస్ఎస్ ప్రాజెక్టు ఆయకట్టుకే ఇంకా దాదాపు 100 టీఎంసీల లోటు ఏర్పడుతుంది. అదీగాక 71వ కిలోమీటర్ మైలారం దాటిన తరువాత కాలువ అలైన్మెంట్ భూములను కోల్‌ఫీల్డ్ కోసం సింగరేణి ఇప్పటికే డిమార్కేషన్ చేసింది. ఇదిలా ఉంటే తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటి తరలింపునకు సంబంధించి పనులను 5 ప్యాకేజీలుగా విభజించగా, తొలుత అందుకు రూ.3,626 కోట్లని అంచనా వేసి, ఆపై ఆ మొత్తాన్ని రూ.5,356 కోట్లకు సవరించారు. ప్రస్తుతం పాత పద్ధతిలో నీటి తరలింపు చేపట్టాలన్నా దాదాపు రూ.24 వేల కోట్ల అవసరమని అధికారులు అంచనాలు రూపొందించారు. ఇది ఆర్థికంగానూ, నీటి తరలింపు పరంగానే భారం కానున్నది.
ప్రాణహిత నుంచి సుందిళ్లకు నీటి తరలింపునకు ఇంజినీర్లు చేసిన ప్రతిపాదనలకు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించారు. సచివాలయంలో నీటిపారుదల ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సోమవారం కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమ్మకసాగర్, సీతమ్మసాగర్, దేవాదుల ప్రాజెక్టుల పురోగతి, ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తాజా ప్రతిపాదనలపై చర్చించారు. తాజా ప్రతిపాదనలతో ప్రాజెక్టు వ్యయం దాదాపు 10 నుంచి 12% తగ్గుతుందని, సుమారు రూ.1,600 కోట్లు ఆదా అవుతాయని అధికారులు వివరించినట్టు సమాచారం. తుమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లితో పోలిస్తే.. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు గ్రావిటీ కెనాల్ పొడవు 30 కిలోమీటర్ల నుంచి 13 కిలోమీటర్లకు, టన్నెల్ పొడవు 24 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్లకు తగ్గుతుందని, 30 మెగావాట్ల కరెంటు సరిపోతుందని వివరించారు. ఈ ప్రతిపాదనలకు మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖర్చు తగ్గించుకుంటూనే సాంకేతికంగా, పర్యావరణ అంశాలను దృష్టిలో పెట్టుకుని తుమ్మిడిహట్టి వద్ద బరాజ్‌ను నిర్మించి సుందిళ్లకి లింక్ చెయ్యడమే సరైన ప్రత్యామ్నాయమని వివరించారు. గతంలో చేసిన సర్వేలను మరోసారి వాలిడేట్ చెయ్యాలని, కొత్తగా జియో టెక్నికల్ స్టడీ, నేల పరిస్థితులపై అధ్యయనం చేయాలని, డీపీఆర్‌ను తయారుచేయాలని ఉత్తమ్ ఆదేశించారు. ప్రాజెక్ట్ ఎత్తుపై మహారాష్ట్రతో సరైన సమయంలో సంప్రదింపులు చేస్తామని వెల్లడించారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర అభ్యంతరాలు, ఇంజినీర్లు వెల్లడించిన సాంకేతిక కారణాల నేపథ్యంలోనే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసింది. అందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఆదినుంచీ రీడిజైన్‌ను తప్పుబడుతూ విమర్శలు చేస్తూనే వచ్చింది. మేడిగడ్డ బరాజ్ ఘటనను సాకుగా చూపి కాళేశ్వరమే నిరర్థకమంటూ ప్రచారం చేసింది. బరాజ్‌లు ఏవీ పనిచేయబోవని, ఎప్పుడు కూలిపోతాయోనని బద్నాం చేసింది. మేడిగడ్డ తరహాలోనే అన్ని బరాజుల్లో అవే సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ అసత్య ప్రచారం చేసింది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్‌ను వినియోగించుకునేందుకు, తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి కాకుండా సుందిళ్లకు నీటి తరలింపునకు ప్రణాళికలను సిద్ధం చేసింది. దీంతో ఇప్పటివరకు బరాజ్‌లపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోతున్నది.
తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపు అసాధ్యమని, ఆర్థిక భారమని ఇంజినీర్లు తేల్చడంతోపాటు క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా మరో ప్రణాళికను ప్రతిపాదించినట్టు సమాచారం. అందులో భాగంగా తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి కాకుండా, దాని దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ల బరాజ్‌కు నీటిని తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసినట్టు తెలిసింది. తుమ్మిడిహట్టి నుంచి 71 కిలోమీటర్ పాయింట్ నుంచి అంటే మంచిర్యాల జిల్లా మైలారం నుంచి సుందిళ్ల బరాజ్ వరకు సుమారు 55 కిలోమీటర్ల దూరం వరద కాలువ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉన్నదని తేల్చినట్టు సమాచారం. అందుకు రూ.16 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలిసింది. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదించినట్టు తెలిసింది.